కాసిపేట, అక్టోబర్ 8 : వన్య ప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి ప్రవీణ్ నాయక్ స్పష్టం చేశారు. బుధవారం జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలం ముత్యంపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలోని మల్కెపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు వన్య ప్రాణుల ఆవశ్యకతపై డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతీయ వన్యప్రాణుల వారం అక్టోబర్ 2 నుండి 8 వరకు నిర్వహిస్తామని, ఈ సంవత్సరం వన్యప్రాణుల వారం ఇతివృత్తం ‘మనిషి- వన్యప్రాణుల సహజీవనం’అని తెలిపారు.
మానవులు, వన్యప్రాణుల మధ్య పరస్పర చర్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మానవులకి వన్యప్రాణులకు మధ్య పెరుగుతున్న సంఘర్షణ నుండి సహజీవనం వైపు దృష్టి మరలచేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు ఈ దశ నుండే పర్యావరణంపై, వన్యప్రాణుల సంరక్ష పై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులకు వన్యప్రాణుల ఆవశ్యకతకు సంబంధించిన వీడియోలను చూపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు హరి నాయక్, శంకర్ బీట్ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు.