Mancherial | మంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ దేవాలయంలో గల వేంకటేశ్వర స్వామి ఆలయం గోపురానికి పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు రోడ్డు వెడల్పులో భాగంగా ఆలయం ముందు ఉన్న దుకాణాలను నగరపాలక అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో హిందూ సంఘాల నాయకులు స్పందిస్తూ.. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగానే ఆలయ గోపురానికి పగుళ్లు ఏర్పడి ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ కార్యనిర్వహణాధికారి ముక్త రవిని వివరణ కోరగా.. గోపురం పగుళ్లకు రోడ్డు విస్తరణ పనులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
మే నెలలో పడిన పిడుగులకు గోపురానికి పగుళ్లు ఏర్పడ్డాయని ఆలయ ఈవో ముక్త రవి తెలిపారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఆలయ మరమ్మతుల కోసం నిధుల కేటాయింపుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతు పనులు చేయిస్తున్నామని వివరించారు.