చెన్నూర్ : చెన్నూర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని బీఆర్ఎస్వి నాయకులు ఎండీ నాయబ్ ఆరోపించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలను మంగళవారం వారు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరైన టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం ఎందుకు పెట్టడం లేదని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను అడిగితే.. తాము ఇలానే పెడతామని, మీ ఇష్టం వచ్చింది చేస్కోండి అని బాధ్యతారహితంగా మాట్లాడినట్లు ఆరోపించారు.
ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై తగిన చర్యలు తీసుకుని విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కమటం మనోహర్, ఎనగందుల ప్రశాంత్, ప్రశాంత్ రెడ్డి, తలారి మురళి, తిరుపతి సురేష్, దేవేందర్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.