తాండూర్, జనవరి 13 : మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని కొత్తపల్లి సర్పంచ్ ఆకుల వెంకటేశ్, ఏపీఎం శ్యామల అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధి రేపల్లెవాడ గ్రామంలో అభినయ గ్రామ సంఘం వారికి పెరటి కోళ్ల పెంపకం పథకం ద్వారా మంజూరైన 26 యూనిట్స్ కోళ్లను గ్రూప్ సభ్యులకు అందజేయడం జరిగింది. ఒక కోడికి రూ.130 చొప్పున సబ్సిడీ ద్వారా అందించినట్లు వారు తెలిపారు.
అవి పెరిగి పెద్దగా అయిన తర్వాత వాటి అమ్మకం ద్వారా వచ్చిన లాభాలను సభ్యులందరూ పొందిన తర్వాత సబ్సిడీ కింద ఇచ్చిన కోళ్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మండలానికి మొత్తం 250 యూనిట్స్ రావడం జరిగిందని ఏపీఎం తెలిపారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పై వచ్చే పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్ధికంగా మరింత ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొల్లూరి సంగీత, సీసీ రాజేశ్వరి, వీవీఏ విష్ణు, తదితరులు పాల్గొన్నారు.