కొత్త గ్రామ పంచాయతీల్లో కొండంత అభివృద్ధి
తీరుతున్న ఏండ్లనాటి సమస్యలు
నెన్నెల, ఆగస్టు 22 : గ్రామ పంచాయతీల పరిధిలో శివారు గ్రామాల్లో మౌలికవసతులు లేక, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. నిధులున్నా పాలకులు, అధికారులు పట్టించుకునే వారు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు, తండాలు కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. వాటికి పాలకవర్గం, అధికారుల నియామకంతో పాటు నిధులు కేటాయించడంతో కొత్త గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి.
కొత్త గ్రామ పంచాయతీలతో అభివృద్ధి..
సీఎం కే చంద్రశేఖర్ రావు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు చిన్న గ్రామాలు, పల్లెలు, తండాలను కొత్త పంచాయతీలుగా 2018 ఏప్రిల్లో ఏర్పాటు చేశారు. వాటికి స్వయం ప్రతి పత్తిని కల్పించారు. ఎన్నికలు నిర్వహించి, పాలకవర్గాన్ని నియమించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఉపాధిహామీ పథకం ద్వారా మౌలిక వసతులను కల్పించుకుంటున్నారు. విద్యుత్ సౌకర్యం లేని పల్లెలకు కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ కా ర్యాలయం, ప్రత్యేక అధికారి, సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రత్యేక అభివృద్ధి కమిటీలు ఏర్పాటై ప్రగతి పథంలో సాగుతున్నాయి. ఇందుకు నెన్నెల మండలంలోని గంగారం గ్రామమే నిదర్శనం.
ప్రగతి పథంలో గంగారం గ్రామం
గంగారం గ్రామం గతంలో ఆవుడం గ్రామ పంచాయతీలో ఉం డేది. ఆవుడం గ్రామానికి కిలోమీటర్ దూరం లో అడవి సమీపంలో ఉంటుంది. గ్రామంలో ప్రధాన రోడ్డు ఉంది. ఇక్కడ నీటి సౌకర్యం సక్రమంగా ఉండేది కాదు. రోడ్డుకు గుంతలు పడి నడవలేని స్థితిలో ఉండేది. ఓట్ల కోసం తప్పా అక్కడి వారిని పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. గంగారం గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఉన్నా వీధి లైట్లు సక్రమంగా ఉండేవి కావు. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు అన్నారు. గ్రామంలో దుప్పపల్లిలోని ఎస్సీ కాలనీలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కుర్మగూడెం వాడలో నీటి సౌకర్యంలేదు. గ్రామంలో మొత్తం 234 గృహాలు, 945 జనాభా, 615 మంది ఓటర్లు ఉన్నారు.
రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు..
గ్రామ పంచాయతీగా ఏర్పాటైన అనంతరం ఎన్నికలు నిర్వహించారు. నూతన పాలక వర్గం ఏర్పాటైంది. అప్పటి నుంచి గ్రామంలో వివిధ పనుల కింద రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. గ్రామంలో ప్రత్యేకంగా పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామం, డంప్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు నాటారు. మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామానికి సరిపడా వాటర్ ట్యాంకులు నిర్మించారు. దుబ్బపల్లిలో ప్రస్తుతం రూ. ఐదు లక్షలతో సీసీ రోడ్డు చేపట్టడానికి పంచాయతీలో తీర్మానించారు. గ్రామంలో ఇంటింటా మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు ఉండేలా చేశారు.