కాంట్రాక్ట్ విధానంలో వైద్య పోస్టుల భర్తీ
వివిధ కేటగిరీల్లో 67 ఖాళీలకు నోటిఫికేషన్
దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 20 దాకా గడువు
అందనున్న మెరుగైన సేవలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ జిల్లాలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని వివిధ దవాఖానల్లో ఖాళీగా ఉన్న పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీచేయనుంది. దీంతో అన్ని వైద్యశాలల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేలా 67 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
67 పోస్టుల భర్తీకి చర్యలు..
జిల్లాలో ప్రధాన దవాఖానతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత ఉంది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం కాంట్రాక్ట్ విధానంపై 67 పోస్టులను భర్తీచేసేందుకు చర్యలు చేపట్టింది. వ్యాధుల నిర్ధారణ కోసం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేసేందుకు నాలు గు పోస్టులను ప్రత్యేకంగా భర్తీచేయనుంది. బయోకెమిస్ట్ ఒకపోస్టు, పాథాలజిస్ట్ ఒక పోస్టు, ల్యాబ్ మేనేజర్ ఒక పోస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్టును భర్తీచేయనుంది. వీటిలో బయోకెమిస్ట్, పాథాలజిస్ట్కు నెలకు రూ.లక్ష వేతనాన్ని ఇవ్వనుంది. ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, ఎంపీహెచ్ఏ(ఫీమెల్) 33 పోస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్ గ్రేడ్-2కు సంబంధించి 3 పోస్టులు, ఫార్మాసిస్ట్ 2 పోస్టులు, స్టాఫ్ నర్స్ 6 పోస్టులను భర్తీచేయనుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అర్హత ఎంబీబీఎస్ కాగా, ఎంపీహెచ్ఎ (ఫీమేల్) పోస్టులకు ఏఎన్ఎం ట్రైనింగ్ చేసి ఉండాలని అర్హత గా పేర్కొంది. ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులకోసం అర్హతగా డీఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ కలిగి ఉండాలి. ఫార్మాసిస్ట్ పోస్టులకు అర్హత డీ ఫార్మసీ లేదా బీఫార్మసీ, స్టాఫ్ నర్స్ పోస్టులకు అర్హత జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హతగా నిర్ణయించింది.
జిల్లాలో తీరనున్న సమస్యలు..
జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ చేయనుంది. దీంతో త్వరలోనే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కానున్నాయి. ముఖ్యంగా పీహెచ్‌సీల్లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోనున్నాయి. జిల్లాలో 45 వైద్యాధికారుల పోస్టులకు గాను 26 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీగా ఉన్న 19 పోస్టులు భర్తీ కానుండడంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది. వైద్యుల పోస్టులతో పాటు 33 ఎంపీహెచ్ఏ(ఫీమేల్) పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ మూడు పోస్టులు, ఫార్మాసిస్ట్ రెండు పోస్టులు, స్టాఫ్ నర్సు ఆరు పోస్టులను భర్తీచేయనుండడంతో అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి స్టాఫ్ ఉండనున్నారు. నిత్యం వైద్య సహాయం కోసం దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
ఈ నెల 20తో ముగియనున్న గడువు..
వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఈ నెల 20నెల వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులకు కాంట్రాక్టు పద్ధతిన పోస్టులను భర్తీ చేయనుంది.