కాగజ్‌నగర్ టౌన్, ఆగస్టు 11:కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదానం.. నిత్య కల్యాణం కావాలని ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ బస్టాండ్ సమీపంలో సాహితీ దిగ్గజం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ మాస్టారు కాంస్య విగ్రహావిష్కరణ, కోనేరు ట్రస్టు నిత్యాన్నదాన సత్రాన్ని పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంకల్పం గొప్పదని, ఆయనలాంటి ప్రజాప్రతినిధి దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు.
ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజాహిత కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప-రమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులు ఎనలేని కృషి చేస్తున్నారని, నిత్యాన్నదానం.. నిత్య కల్యాణం కావాలని విప్ అరికెపుడి గాంధీ ఆకాంక్షించారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సాహితీ దిగ్గజం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ మాస్టారు కాంస్య విగ్రహావిష్కరణతో పాటు నిత్యాన్నదాన సత్రం కార్యక్రమాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో పాటు జడ్పీచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంకల్పం ఎంతో గొప్పదన్నారు. కోనప్పలాంటి ప్రజాప్రతినిధి దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ.. సామల సదాశివ మాస్టార్ తమ తండ్రి గురువని, ఉన్నత చదువులు, చదువుకొని ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారని తెలిపారు. గురువును మరవకుండా సేవలు అందించారని గుర్తు చేశారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చదువు నేర్పిన గురువును దైవంగా భావించి భావితరాలకు స్పూర్తిగా విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం అభినందనీయమన్నారు. కోనప్ప పెద్దమనస్సుతో చేపడుతున్న అన్నదానం గొప్ప కార్యమని, అతనొక విలక్షణ నటుడని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ఎన్నో పురస్కారాలు పొందిన సామల సదాశివ మాస్టార్ ఆదిలాబాద్‌లో ఆగస్టు 7న చనిపోయాడని, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాస్టారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి భావితారాలకు స్ఫూర్తినిచ్చేలా నిలిచిపోయారని, నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్ మాట్లాడుతూ.. నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి సాహసోపేత నిర్ణయం తీసుకున్న కోనప్పకు, వారి కుటుంబసభ్యులకు దేవుడి ఆశీస్సులుంటాయని, మరింత ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు సాగాలన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. అన్ని దానాలకన్నా అన్నదానం, విద్యాదానం ఎంతో గొప్పవన్నారు. నిరుద్యోగులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత శిక్షణ అందించడం హర్షణీయమన్నారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని, నియోజకవర్గ ప్రజల ఆదరణ వెలకట్టలేనిదని తెలిపారు. ప్రజల రుణం తీర్చుకోవాలని నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ 1000మందికి పైగా భోజనం పెట్టాలనే లక్ష్యంతో నిత్యాన్నదాన సత్రం కొనసాగుతుందన్నారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని, అవసరమైతే రాజకీయం వదిలి పెడతానని, అన్నదానం చేయడం వదిలి పెట్టబోనని, కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ఉన్నత చదువుల కోసం పట్టణంలోని కళాశాలలకు విద్యార్థులు వచ్చి మధ్యాహ్నం ఆకలితో అలమటించేవారని, దీనిని దృష్టిలో ఉంచుకొని మొదటగా 455 మంది విద్యార్థులకు అన్నదానం ప్రారంభించామన్నారు.
ఐదేండ్లలో 2450 మంది విద్యార్థులకు చేరిందని, నవంబర్ 1వ తేదీ నుంచి మార్చి1వ తేదీ వరకు భోజనం అందించడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో కుమ్రం భీం జిల్లా నిలిచిందన్నారు. ఈ ప్రాంత ఉద్యోగాలు ఇక్కడి వారికే రావాలనే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. 189 జంటలకు పెండ్లీలు చేయడంతో ప్రభుత్వం అందించే కల్యాణలక్ష్మి వర్తించిందని తెలిపారు. ఉదయం సత్రంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య ఎమ్మెల్యే దంపతులు, కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోనేరు కోనప్ప అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, భాస్కర్‌రావు, దుర్గం చిన్నయ్య, మాజీ ఎంపీ నగేశ్, చేతన ఫౌండేషన్ ప్రతినిధులు, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, ఆర్డీవో చిత్రు, సాహితీ సదస్సు, పద్మశాలీ సేవా సంఘం సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.