‘పల్లె, పట్టణ ప్రగతి’తో మారిన రూపురేఖలు
ఊరూరా పూర్తయిన డంప్‌యార్డులు, వైకుంఠధామాలు
ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ అందజేత
పల్లె ప్రకృతి వనాలతో సరికొత్త శోభ
హరితహారం మొక్కలతో పచ్చదనం
మెరుస్తున్న రోడ్లు.. జిగేల్మంటున్న వీధి లైట్లు
తీరిన చెత్త ఇక్కట్లు.. రోగాలు దూరం
మంచిర్యాల, జూలై 2(నమస్తే తెలంగాణ):ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పల్లె, పట్టణ ప్రగతి’ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఊర్లు.. పట్టణాలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని 310 గ్రామ పంచాయతీల్లో దాదాపు 100 శాతం పనులు పూర్తయ్యాయి. చిమ్మచీకట్లు తొలగిపోయి కాలనీలు ఎల్ఈడీ లైట్లతో జిగేల్మంటున్నాయి. ఎప్పటికప్పుడు తడి, పొడి చెత్త వేరు చేసి డంప్‌యార్డులకు తరలిస్తుం డగా, వీధులన్నీ పరిశుభ్రతకు చిరునామాగా మారాయి. ఇక సీసీ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. వైకుంఠధామాలతో ఆఖరి మజిలీకి చింతలేకుండా పోయింది. పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం పంచుతున్నాయి.
శతశాతం సంపూర్ణం..
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలను అందంగా తీర్చిదిద్దారు. పాడుబడ్డ బావులకు స్వస్తి పలికారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంప్‌యార్డులు, రైతు వేదికలు దాదాపు వంద శాతం నిర్మించారు. ట్రాక్టర్లు, ట్రాలీలను సద్వినియోగం చేసుకోవడంతో గ్రామాలన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీలు, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ ట్రాలీలు, ట్రాక్టర్లు ఉన్నాయి. వీటితో పారిశుధ్య కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డులకు తరలిస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో వందశాతం మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. జిల్లాలో 548 ఆవాసాలు (హ్యాబిటేషన్స్) ఉండగా, అన్నింటికీ స్థలాలు గుర్తించారు. అన్నింటిలోనూ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వందశాతం పూర్తి చేశారు. డంప్‌యార్డుల నిర్మాణం, వాడకంలోనూ జిల్లా ముందువరుసలో ఉంది. వందశాతం వాడకానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 310 జీపీల్లోనూ డంప్‌యార్డులను ఏర్పాటు చేశారు. కంపోస్టు ఎరువులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 310 జీపీలకుగాను 308 గ్రామ పంచాయతీల్లో వైకుంఠ ధామాలు పూర్తయ్యాయి. 99.35 శాతం పూర్తి కాగా, ప్రస్తుతం అన్నీ వినియోగంలో ఉన్నాయి. తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. 51.67 లక్షల విత్తనాల లక్ష్యం (సీడింగ్ టార్గెట్‌కు) కాగా, వందశాతం సాధించింది. నర్సరీల్లో 51.67 లక్షల మొక్కలు పెరుగుతున్నాయి. తెలంగాణకు హరితహారం 2021-22లో భాగంగా తోటల సంఖ్య (ప్లాంటేషన్ల సంఖ్య) 4530 కాగా, 24,37,242 లక్షల మొక్కలు నాటారు. ఇందులో 22,95,373క లక్షల మొక్కలు బతికి ఉన్నాయి. 94.18 శాతం బతికి ఉండడంతో వాటిని నాటి, సంరక్షించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
తీరిన ‘చెత్త’ ఇక్కట్లు.. రోగాలు దూరం..
గ్రామాల్లో గతంలో ఎక్కడపడితే అక్కడే చెత్తాచెదారం దర్శనమిచ్చేది. తీసివేసేవారు కాదు. మేజర్ పంచాయతీ ల్లో మాత్రమే వీధులను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించేవారు. ప్రస్తుతం అన్ని వీధుల్లో చెత్తాచెదారాన్ని తొలగించి.. గ్రామానికి దూరంగా వేస్తున్నారు. చెత్తను ఆరు బయట వేయకుండా డంప్ యార్డులను ఏర్పాటు చేసి అందులో వేస్తున్నారు. గ్రామాల్లో సేకరించిన చెత్తా చెదారాన్ని తీసుకెళ్లి డంప్ యార్డులో వేయడంతో గ్రామాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణంతో గతంలో రోగాలు విజృంభించేవి. రోగులతో దవాఖానలు కిటకిటలాడేవి. ప్రస్తుతం పల్లె ప్రగతి కార్యక్రమాల పుణ్యమాని గ్రామస్తులు ఆరోగ్యంగా ఉన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, శుభ్రమైన వాతావరణంలో జీవిస్తూ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతోనే గ్రామాల్లో రోగాలు, వ్యాధులు తగ్గాయని వైద్యులు, విశ్లేషకులు చెబుతున్నారు.
పల్లె ప్రకృతి వనాలు..
గ్రామాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించేలా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది. విశాలమైన ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి పట్టణాల్లో పార్కుల మాదిరి పల్లెల్లోనూ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి అందులో ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్నట్లు పంచాయతీలకు కేటాయించిన నిధుల్లో గ్రీన్‌బడ్జెట్ కింద ఖర్చు చేసే 10 శాతం నిధులను వీటికి ఉపయోగిస్తారు. జిల్లాలో 548 ఆవాసాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు వందశాతం హ్యాబిటేషన్లలో (ఆవాసాల్లో) పూర్తయ్యాయి. పల్లె ప్రకృతి వనాల్లో వందశాతం మొక్కలు కూడా నాటి సంరక్షిస్తున్నారు. ఇందులో కొన్ని చోట్ల చిన్నారులు ఆడుకునే వస్తువులు, ఊయలలు, జారుడు బండలు, కూర్చునే బెంచీలు, తదితర ఏర్పాట్లు కూడా చేశారు.