నస్పూర్, ఆగస్టు 11 : జిల్లాలో పంటల సాగుకు అవసరమైన యూరియా ఉందని, యూరియా పక్కదారి పట్టకుండా నిఘా పెట్టి.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్లో వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ యూరియా కృత్రిమ కొరత సృష్టించడం, పక్కదారి పట్టించడంవంటి అంశాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. యూరియా అధిక మొత్తంలో కొనుగోలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు పంటలసాగు, దిగుబడికి సంబంధించిన రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు.
జిల్లాలో మక్క సాగు విస్తీర్ణం 70 ఎకరాల నుంచి 300 ఎకరాలకు పెరిగిందని, అవసరమున్న చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌పాం సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతు బీమా పథకంలో రైతులందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి చాత్రు, జిల్లా ఉద్యానవన అధికారి అనిత, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.