నస్పూర్, ఫిబ్రవరి 4 : మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చిన నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జీఐఎస్ ఆధారిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ (హైద్రాబాద్) అదనపు సంచాలకుడు రమేశ్‌బాబు, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ శివాజీతో కలిసి సంబంధిత అధికారులకు మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా నవీకరిస్తామని, ఈ క్రమంలో డ్రోన్ సర్వే ద్వారా సంబంధిత వివరాలు సేకరించామని తెలిపారు. కార్పొరేషన్ రూపకల్పనతో పాటు నివాస ప్రాంతాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించాల్సి ఉంటుందని, ఆయా ప్రాంతాల్లో వివిధ అంశాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తామన్నారు. స్టడీ మ్యాప్స్ తయారు చేసి, ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు.
నస్పూర్‌లోని కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీ పక్ వీవోఏ, ఆర్పీ, గ్రామ సంఘాలకు పీవోఎస్ పరికరాలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పీవోఎస్ పరికరాలతో స్త్రీనిధి పథకం కింద రుణాల మంజూరు, వసూలు ప్రక్రియ సులభతరంగా ఉంటుందని తెలిపారు. దీనిపై ఒక్కరోజు శిక్షణ కూడా నిర్వహించినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శివాజీ, మెప్మా పీడీ మారుతి, డీఆర్డీవో కిషన్, స్త్రీనిధి జోన ల్ మేనేజర్ రవికుమార్, రీజనల్ మేనేజర్ వెంకటరమణ, టీఎంసీలు పాల్గొన్నారు.