నస్పూర్, ఏప్రిల్ 21 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులు, అర్జీలను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం బీఐఎస్ కేర్ యాప్‌నకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అన్ని ప్రభుత్వ శాఖలు మార్కెట్లోని ఉత్పత్తులు బీఐఎస్ ప్రమాణాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఐఎస్ జిల్లా ప్రతినిధి రాళ్లబండి రాజన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిషారానికి చర్యలు
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 21: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారుల సమన్వయంతో త్వరగా పరిషరించేందుకు చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.