కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 23: బొగ్గు ఉత్పత్తితో పాటు ఇప్పటికే థర్మల్, సోలా ర్ విద్యుత్ రంగాల్లోకి అడుగు పెట్టిన సింగరేణి సంస్థ తాజాగా భూగర్భం నుంచి ఉబికి వచ్చే వేడి నీటితో విద్యుత్‌ను తయారు చేసే (జియోథర్మల్) కేంద్రాన్ని మరో ఆరు నెలల్లో ప్రారంభించనుంది. దేశంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ జియోథర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంపై సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకొని సింగరేణి అధికారులు, నిర్మాణ సంస్థ శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులతో ఇటీవల సమీక్ష నిర్వహించారు. నిర్ణీత గడువు కన్నా ఆరు నెలల ముందు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి కల్లా నిర్మాణం పూర్తి చేసి జియో థర్మల్ విద్యుత్ ఉత్పాదన చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ సైంటిస్టు, నిర్మాణ ఏజెన్సీ అధికారులు, సింగరేణి అధికారులు తమ పనులను మరింత వేగవంతం చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు జీఎం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సుభాని, మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేశ్, డీజీఎం కనకయ్య, శ్రీరాం ఇనిస్టిట్యూట్‌కు చెందిన జీఎం, శ్రీరాం కంపెనీ నుంచి డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లు ఇటీవల ప్రాజెక్టు నిర్మాణ స్థల ప్రదేశాన్ని పరిశీలించారు. చేపట్టాల్సిన ప్లాంట్ పనుల్లో అప్రోచ్ రోడ్ నిర్మాణం 2021 అక్టోబర్ 11 కల్లా పూర్తి చేయాలని, బోర్హోల్స్కు వాల్వ్ ఏర్పాటు, కేజ్ ఏర్పాటు లాంటివి ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీ కల్లా పూర్తి చేయాలని సూచించారు. ప్లాంట్‌కు సంబంధించిన పూర్తి డిజైన్లు డిసెంబర్ 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ప్లాంట్ విడిభాగాలను పగిడేరుకు తీసుకొచ్చి అమర్చాలని, వచ్చే యేడాది మార్చి 30 కల్లా విద్యుత్ ఉత్పాదన ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. జీఎం కో ఆర్డినేషన్ సూర్యనారాయణ, జీఎం ఎస్డీఎం సుభాని, మణుగూరు ఏరియా జీఎం జక్క రమేశ్, జీఎం రమేశ్‌బాబు పాల్గొన్నారు.