ఆరుగాలం కష్టపడి పంట తీసిన రైతన్నలను అడుగడుగునా నిలువుదోపిడీ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులే దళారుల అవతారమెత్తి తక్కువ ధరకు సన్నరకం వడ్లు కొని.. ఆపై బినామీల పేరిట ప్రభుత్వానికి అమ్మి బోనస్‌ను స్వాహా చేస్తున్నారు. అన్నదాతల వద్ద క్వింటాల్‌కు రూ. 2,650 చొప్పున కొనుగోలు చేసి.. ఆ తర్వాత కర్షకులే అమ్మినట్లుగా ట్రక్ షీట్లు సృష్టించి రూ. 2,820 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
– దండేపల్లి, జనవరి 8
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కడెం, గూడెం ఆయకట్టు పరిధిలోని రైతులు ఎక్కువగా సన్న రకాన్ని సాగు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడవడంతో కొనుగోళ్లలో జాప్యమైంది. ఇదే అదనుగా భావించిన దళారులు రింగ్‌గా ఏర్పడి సన్న రకాల ధరలను తగ్గించేశారు. దీంతో రైతులు ప్రభుత్వం ఇస్తున్న బోనస్ ఆశతో మద్దతు ధర వస్తుందనుకొని కొనుగోలు కేంద్రాల బాట పట్టారు. కొందరు కేంద్రాల నిర్వాహకులు దళారుల రూపంలో అక్కడే ఉండడంతో రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం మండలాల్లో దళారులు రైతుల వద్ద నుంచి తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేసి.. ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల పేరిట మిల్లులకు తరలిస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. దళారులు రైతుల వద్ద నుంచి సన్న రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,650 చెల్లించి ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధరను లాగేసుకుంటున్నారు. ఇప్పటికే ఇలా బినామీల పేరిట ప్రభుత్వానికి అధిక మొత్తంలో ధాన్యం అమ్మినట్లు తెలుస్తున్నది.
ఇలా చేస్తున్నారు
దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు దళారీ అవతారం ఎత్తి రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసి.. ఆపై వారి బంధువుల పేరిట ట్రక్ షీట్లు రాసి పంపిస్తున్నట్లు తెలుస్తున్నది. రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి క్వింటాలుకు రూ. 150 చొప్పున లాభం అర్జిస్తున్నారు. ఒక లారీలో దాదాపు 300 క్వింటాళ్ల వరకు మిల్లుకు చేరితే రూ.45 వేల వరకు జేబులు నింపుకుంటున్నారు. మరికొన్ని చోట్ల రైతుల అకౌంట్లలోకి క్వింటాల్‌కు సరిపడా డబ్బులు జమచేసి.. తర్వాత తమ అకౌంట్లలోకి జమ చేసుకుంటున్నారు. ప్రభు త్వం బోనస్‌తో కలిపి క్వింటాలుకు రూ.2,820 డబ్బులు ఇస్తుంది. అయితే గ్రామాల్లో దళారులు క్వింటాలుకు రూ.2600 చొప్పున కొనుగోలు చేసి కేంద్రాల నిర్వాహకులతో మిలాఖత్ అవుతూ నిం డా దోచుకుంటున్నారు. దండేపల్లి మండలంలోని గూడెం వద్ద పట్టుబడ్డ లారీని అధికారులు తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
లారీలో 70 కిలోల బరువు గల 295 సన్న రకం వరి ధాన్యం బస్తాలతో పాటు సివిల్ సప్లయ్ శాఖకు సంబంధించిన 570 ఖాళీ గన్ని సంచులు లభ్యమయ్యాయి. 70 కిలోల సంచుల్లోని వరి ధాన్యాన్ని రైస్‌మిల్లుకు చేరవేసి అక్కడే సివిల్ సప్లయ్‌కు సంబంధించిన ఖాళీ గన్ని సంచుల్లో నింపి సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం అందించే రూ.500 బోనస్‌ను రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన మధ్యవర్తులు, సెంటర్ నిర్వాహకులు నొక్కేస్తున్నారు. పాతమామిడిపెల్లిలో ధాన్యాన్ని తరలించేందుకు గ్రామపంచాయతీ నుంచి ఇచ్చిన ఫాం నంబర్-10లో గ్రామ ప్రత్యేకాధికారి అయిన తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం గమనార్హం. అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ నెల 3న గూడెం చెక్‌పోస్ట్ వద్ద ధాన్యం తరలిస్తున్న లారీని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాతమామిడిపెల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి కొనుగోలు చేసినట్లు ట్రక్ షీట్ రాసుకోగా, పట్టుకున్న లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేంద్రం ని ర్వాహకులు, దళారులపై కేసులు నమోదు చేశారు. ఈ దందాపై ఇకనైనా విచారణ జరిపి బా ధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం
రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కోసం బినామీల పేరిట మిల్లులకు తరలిస్తున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మండలంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎవరైనా సమాచారం ఇస్తే కేసులు నమోదు చేస్తాం.
– విజయ, డిప్యూటీ తహసీల్దార్