మంచిర్యాలటౌన్, జూన్ 11 : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 14న నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాసరావు సూచించారు. మంచిర్యాలలో ఉమ్మడి నాలుగు జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు, ఉప వైద్యాధికారులు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం అధికారులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారని, రెండు వేల పడకల సామర్థ్యానికి పెంచనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇందుకోసం సీనియర్ అధికారులను ఇన్చార్జిలుగా నియమించాలన్నారు.
నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశాన్ని నిర్వహించుకోవాలని, అందుకోసం ఏసీ ఫంక్షన్ హాల్‌ను తీసుకొని అందులో రెండు వైపులా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వాటిపై వైద్యారోగ్య శాఖ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌లు ప్రదర్శించాలన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొనాలని, వీరికి బ్యాడ్జీలు అందించాలని ఆదేశించారు. అన్ని పీహెచ్‌సీలు, పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల్లో మామిడి తోరణాలతో అలంకరించి ముగ్గులు వేయాలని సూచించారు. వైద్యారోగ్య శాఖకు సంబంధించి రూపొందించిన కరపత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో ఆవిష్కరించాలని తెలిపారు. నియోజకవర్గంలో బాగా పనిచేసిన ఉద్యోగులను గుర్తించి వారికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించాలని తెలిపారు. కొత్తగా నియమించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో కొత్తగా చేరిన విద్యార్థులను వేడుకలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
కొంతమంది కంటివెలుగు, ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్ లబ్ధిదారులు, డయాలసిస్ పేషెంట్లతో వారి అనుభవాలను తెలియపరచాలని తెలిపారు. 10 నుంచి 15 మంది గర్భిణుల ను హెడ్‌క్వార్టర్ నుంచే ఆహ్వానించి వారికి న్యూ ట్రీషన్ కిట్లను అందించి పథకాన్ని ప్రారంభించాలని సూచించారు. ఇద్దరు లేదా ముగ్గురు ఏఎన్ఎంలకు బీపీ మీటర్లను అందించాలని, ఆ తర్వాత అన్ని పీహెచ్‌సీలకు పంపించనున్నట్లు చె ప్పారు. ఈ సమావేశంలో మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ డీఎంహెచ్వోలు సుబ్బారాయుడు, ధన్‌రాజ్, రామకృష్ణ, నరేందర్ రాథోడ్, రిమ్స్ ఆర్ఎంవో వసంతరావు, మంచిర్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సులేమాన్, డిప్యూటీ డీఎంహెచ్వోలు, సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.