“తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద డబ్బులను మీ ఖాతాల్లో జమ చేసింది. ఈ సాయం పెట్టుబడి, ఇతర వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. మీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు” పేరిట మెస్సేజ్‌లు మొబైల్స్‌కు రావడంతో రైతుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. పక్షం రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ రైతుబంధు డబ్బులు వేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. తొలిరోజు 40 గుంటల భూమి ఉన్న రైతులకు పెట్టుబడి డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,31,790 మంది రైతుల ఖాతాల్లో రూ.39.18 కోట్లు జమ అయ్యాయి. రెండో రోజైన గురువారం రెండెకరాల భూమి వారికి పెట్టుబడి సాయం అందించనుంది. సంక్రాంతికి ముందే డబ్బులు రావడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ టౌన్, డిసెంబర్ 28
ఆదిలాబాద్ రైతులు 12,511 డబ్బులు 4.48 కోట్లు
నిర్మల్ రైతులు 45,129 డబ్బులు 13.82 కోట్లు
మంచిర్యాల రైతులు 48,191 డబ్బులు 14.08 కోట్లు
ఆసిఫాబాద్ రైతులు 25,959 డబ్బులు 6.80 కోట్లు
36 గుంటలకు.. రూ.4,500 వచ్చినయ్..
నా పేరు షేక్ అప్రోజ్. నేను ఎవుసం జేస్త. భీంపూర్ మండల్లోని పిప్పల్‌కోటిలో 36 గుంటల జాగ ఉంది. సీఎం కేసీఆర్ సారు రైతుబంధు డబ్బులేస్తడని విన్న. అనుకుంటున్ననో లేదో నా సెల్‌కు బుధారం పొద్దుగాల 11 గంటలకు కుయ్ కుయ్ అంటూ మెస్సేజ్ వచ్చింది. ‘మీకు రైతుబంధు డబ్బులచ్చినయ్.. వ్యవసాయ పనులకు వాడుకోండని’ సీఎం పేరిట మెస్సేజ్ ఉంది. ఎంటనే గ్రామీణ బ్యాంకుకు పోయిన. బ్యాంకోళ్లను రైతుబంధు డబ్బులచ్చినయా అని అడిగిన. రూ.4,500 వచ్చినయని జెప్పిండ్రు. సానా సంతోషమనిపించింది. ఇగ ఎరువులు కొంట. పంట పంటకు ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ సారును మరువ.
ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ టౌన్, డిసెంబర్ 28 : పదో విడుత రైతుబంధు డబ్బులు బుధవారం రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు ఇస్తున్న సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడు అంటూ రైతులు వెయ్యినోళ్ల పొగుడుతున్నారు. ఒక ఎకరం, ఆ లోపు ఉన్న రైతులకు డబ్బులు పడ్డాయి. ‘తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద డబ్బులను మీ ఖాతాల్లో నమోదు చేసింది. ఈ సాయం పెట్టుబడి, ఇతర వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. మీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు’ అనే సందేశాన్ని ప్రతి ఒక్క రైతుకు పంపించారు. దీంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తొలిరోజు..
ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంటకు సంబంధించిన రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో బుధవారం నుంచి జమ అవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 1.53 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.275.99 కోట్లను ప్రభుత్వం అందిస్తుంది. ఇందులో తొలిరోజు 12,511 మందికి రూ.4.48 కోట్లు జమయ్యాయి. పదో విడుత డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో అన్నదాతలు సంబురాలు చేసుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 1.14 లక్షల మంది రైతులు ఉన్నారు. మొదటి రోజు 25,959 మంది రైతుల ఖాతల్లో రూ.6.80 కోట్లు జమ అయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఈ సీజన్‌కు సంబంధించి 1,86,418 మంది రైతులకు రూ.227.64 కోట్లు జమకానున్నాయి. తొలిరోజు 45,129 మంది రైతులకు రూ.13.82 కోట్లు జమఅయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 1.56 లక్షల మందికి రూ.172.11 కోట్లు జమకానున్నాయి. ఇందులో తొలి రోజు 48,191 మందికి రూ.14.08 కోట్లు జమ అయ్యాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో రైతులు ఎడ్లబండిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీ పెట్టి బ్యాండు మేళాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పంట పొలాల్లో రైతులు సంబురాలు చేసుకున్నారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆప్ కీ బార్ కిసాన్‌కి సర్కార్ అంటూ నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంచిర్యాల యువ నాయకుడు నడిపెల్లి దివాకర్‌రావు, ముల్కల్ల సర్పంచ్ మంచాల శ్రీనివాస్, ఎంపీటీసీ గడ్డం లతాశ్రీ, ముల్కల్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు కుడుక సత్యం, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
రేపు నాట్లు పడుతాయ్..
నాకు ఒక ఎకరం పొలం ఉంది. వారం కింద వడ్ల పైసలు పడ్డాయి. ఇప్పుడు రైతుబంధు డబ్బులు వచ్చాయి. యాసంగి సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. నాట్లు వేసేందుకు కూలీలకు రూ.4వేలు కావాలి. ఇప్పుడు ఇచ్చిన రైతుబంధు డబ్బులతో రేపే నాట్లు వేసుకుంటాం. నా భార్య పేరిట మరో రెండెకరాలు ఉంది. మరో రెండు రోజుల్లో ఆ డబ్బులు కూడా పడుతాయన్నరు. రైతు గురించి ఆలోచించే కేసీఆర్ సీఎంగా ఉండడం మా అదృష్టం. ఆకలితో ఉన్నోడికి అన్నం విలువ తెలిసినట్లే.. రైతుబంధు విలువ రైతులకే తెలుసు. సీఎం కేసీఆర్ నిజమైన రైతు నాయకుడు.
– ముత్యే మల్లేశ్, నవ్‌నూర్, హాజీపూర్ మండలం.
రూ.3,375 వచ్చినయ్..
కడెం, డిసెంబర్ 28 : మాది నిర్మల్ జిల్లా కడెం మండలం కన్నాపూర్ గ్రామం. యాసంగి పంట పెట్టుబడి సాయం బుధవారం నా బ్యాంక్ ఖాతాలో జమ అయినవి. నాకు 27 గుంటల భూమి ఉండగా.. ఈ రోజు నా ఖాతాలో రూ.3,375 జమ చేసిండ్రు. ఏడాదికి రెండు సార్లు నాకు సంవత్సరంలో రూ.6,750 వస్తున్నాయి. గతంలో పెట్టుబడులకు ఇబ్బందిగా ఉండేది. సాగు కోసం దళారుల దగ్గర వడ్డీ తీసుకొని సాగు అయ్యాక తిరిగి వడ్డీతో కట్టేవాన్ని. అయితే రాష్ట్ర సర్కారు రైతుబంధు సాయంతో ఇప్పుడు పెట్టుబడులకు ఇబ్బంది తీరింది.
– బైరి అంజన్న, రైతు, కన్నాపూర్, కడెం, నిర్మల్ జిల్లా.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
నాకు 24 గుంటల భూమి ఉంది. నా భర్త మరణించిన తర్వాత భూమి నా పేరిట పట్టా చేయించుకున్న. నాకు 24 గుంటలకు బుధవారం రూ.3వేలు జమ అయినవి. వానకాలం, యాసంగి రెండు పంటలకు నాకు పెట్టుబడి సాయం అందుతున్నది. పెన్షన్‌తోపాటు, రైతుబంధు డబ్బులు సాయం అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– జాడి యశోద బాయి, రైతు, పెద్దబెల్లాల్, కడెం, నిర్మల్ జిల్లా.