తానూర్, మే, 11 : మక్కల కొనుగోళ్లు నిలిపివేసి వారం రోజులైనా కొనకపోవడంతో మక్క రైతులు కన్నెర్ర జేశారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం తానూర్ మండల కేంద్రంలో తానూర్-బెల్తరోడ రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో గోదాముల వద్ద నిలువ ఉన్న మక్కలు తడిసి నష్టపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాస్తారోకో విషయం తెలుసుకొని తహసీల్దార్ మహేందర్నాథ్, ఎస్ఐ షేక్ జుబేర్, సొసైటీ సీఈవో సాయరెడ్డి రైతుల వద్దకు చేరుకుని చర్చలు జరిపారు. రెండు రోజుల్లో మక్కల కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సుభాష్, చందు, పుండ్లిక్, రైతులు సాయినాథ్, లక్ష్మణ్పటేల్, కిశోర్, దత్తు, వెంకటేశ్, సంతోష్ పాల్గొన్నారు.