నిర్మల్ టౌన్, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయసాధనకు రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించారు. దీనికి మంత్రి హాజరై ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఫూలే చేసిన కృషిని ప్రభుత్వం ఎప్పుడూ మరిచిపోకూడదనే ఉద్దేశంతోనే బీసీ గురుకులాలకు ఆయన పేరు పెట్టిందని తెలిపారు.
రాష్ట్రంలో గురుకులాలను ఏర్పాటు చేయడం వల్ల పేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్య అందిస్తున్నామన్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించా రు. వెనుకబడిన వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీసీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీఆర్వో లోకేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నాయకులు కృష్ణంరాజు, పోశెట్టి, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.