ఓం నమః శివాయ.. హర హర మహదేవ.. శంభో శంకర.. హరోం హర.. అనే శివ నామస్మరణతో శైవక్షేత్రాలు మారుమోగాయి. శనివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇసుకతో శివలింగాలు తయారు చేసి పూజలు చేశారు. వేకువ జాము నుంచే బారులుదీరడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నిత్యాన్నపూజ, అభిషేకం, రుద్రహవనము, పల్లకీసేవ, అఖండ దీపారాధన, పుణ్యహవచనం, లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శివ-పార్వతుల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించి, పల్లకీలో ఊరేగించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి, రాత్రి జాగరణ చేశారు. కాగా.. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ ఎంపీ నగేశ్, ప్రజా ప్రతినిధులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మొక్కుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం మహా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగాయి. భక్తులు ఉదయాన్నే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇసుకతో శివలింగాలు తయారు చేసి పూజలు చేశారు. శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భైంసా మండలంలోని దేగాంలో స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పూజలు చేశారు. ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఉట్నూర్ మండలంలోని సాలేవాడలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ గోడం నగేశ్ పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి గంగపుత్ర శివాలయం వరకు మహాకాల్ సేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. శివుడి ప్రతిమను వాహనంలో పెట్టి ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జోగు రామన్న హాజరై ర్యాలీని ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా తెప్పించిన డోల్ బృందం ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారిపొడువునా బృంద సభ్యులు లయబద్ధంగా డోలు వాయించడంతో ర్యాలీ ఆసాంతం ఉత్సాహంగా సాగింది. దిలావర్పూర్ మండలంలోని కదిలి ఆలయం వద్ద నిర్మల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, నిర్మల్ డీఎఫ్‌వో సునీల్ హెరమల్ పూజలు చేశారు.