మంచిర్యాల, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు సర్కారు సిద్ధమైంది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తూ అభాసుపాలవుతున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ఉచితంగా చేయాలంటూ నానా యాగీ చేశారు. అడ్డగోలు ప్రకటనలు ఇచ్చి జనాలను బోల్తా కొట్టించారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరిస్తామని ప్రకటనలు ఇచ్చారు.
అప్పుడు కేసీఆర్ సర్కారు ఫీజు తీసుకుని క్రమబద్ధీకరణ చేస్తామని చెప్తే పేదలు, సామాన్యుల రక్తం తాగుతున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామంటూ బీరాలు పలికారు. ఇప్పుడు సీన్ మారింది. అప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్న నేతలందరూ ఇప్పుడు మంత్రులయ్యారు. ఫీజులు లేకుండా ఉచితంగా చేస్తామన్న ఎల్ఆర్ఎస్పై మాట మార్చి ఇప్పుడు పైసలు కడితేనే ఎల్ఆర్ఎస్ చేస్తామంటున్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట కోట్ల రూపాయల వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు.
పేదలు, సామాన్యులంటూ ముసలి కన్నీరు కార్చి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరిట రూ.25 వేల కోట్లు రాబట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో 87 వేల దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిన్నింటినీ క్రమబద్ధీకరిస్తే కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సంగతి ఎలా ఉన్నా.. మొన్నటి వరకు ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చెస్తామని చెప్పి ఇప్పుడు ఫీజులు కట్టాల్సిందే నంటూ మాట మార్చడంతో పేదలు, సామాన్యులపై భారం పడనుంది.
నాలుగేళ్లుగా ఎదురుచూపులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్-2020 పేరిట గత సర్కారు దరఖాస్తులను స్వీకరించింది. నాలుగేళ్ల క్రితం ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలలపాటు ఓపెన్ ప్లాట్లు, నాన్ లే-అవుట్లకు సంబంధించి దరఖాస్తుదారులు రూ.1000 ఫీజు చెల్లించి డాక్యుమెంట్స్ సమర్పించారు. పెద్ద లే అవుట్లకు రూ.10 వేలు దరఖాస్తు ఫీజు తీసుకున్నారు.
కొన్నింటిని పరిష్కరించగానే కోర్టు కేసులతో ప్రక్రియ నిలిచింది. దీంతో ఇప్పుడు కోట్ల రూపాయల ఆదాయమార్గంగా కనిపిస్తున్న ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ కన్ను పడింది. ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మూడు నెలల్లో పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. అవసరమైతే వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగులను వాడుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.
నాలుగు దశల్లో ప్రాసెస్..
తొలి దశలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిస్టమ్ బేస్డ్ డేటాను అనుసరించి ఫిల్టర్ చేస్తారు. సర్వే నంబర్లవారీగా వాటిని క్లస్టర్లుగా డివైడ్ చేస్తారు. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నా, కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ సమర్పించకపోయినా దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తారు.
రెండో దశలో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ ఇన్స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, పంచాయతీ అధికారుల టీమ్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తుంది. వారికి మాత్రమే లాగిన్ ఉన్న యాప్‌లో సంబంధిత ఆస్తి నాలాలు, చెరువులు, కుంటలు, హెరిటేజ్ ప్రాపర్టీ, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు, కోర్టు కేసుల్లో ఉన్నాయా లేదా పరిశీలించి అభ్యంతరాలుంటే నమోదు చేస్తారు.
లెవల్-2లో అర్హత సాధించిన దరఖాస్తులను పరిశీలిస్తారు. సంబంధిత ప్లాట్ లేదా లే అవుట్‌కు రోడ్లు ఎం త వెడల్పుతో ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం చేశా రా లేదా, ఓపెన్ స్పేస్ ఎంత ఉంది. తదితర సాంకేతిక అంశాలను వెరిఫై చేస్తారు. అన్ని కరెక్ట్‌గా ఉన్నాయని సీపీవో లేదా టీపీవో అధికారులు నిర్ధారిస్తారు. అనంతరం అవసరమైన పత్రాలు సమర్పించడంతోపాటు ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తారు.
చివరి దశలో అన్ని రకాల అర్హతలు సాధించిన దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అదనపు కలెక్టర్లు, కలెక్టర్ల స్థాయిలో తుది నిర్ణయం వెలువడుతుంది. క్రమబద్ధీకరించిన, రిజెక్ట్ చేసినా సిస్టమ్‌లో అవి ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతాయి. ఇలా నాలుగు దశల్లో ఎక్కడ జరగాల్సిన పని అక్కడ నిబంధనల ప్రకారం అయిపోతూ ఉంటుంది.
మూడు నెలల్లో పూర్తి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మూడు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2020లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకున్నప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 87,021 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 36,239 అప్లికేషన్లను ప్రాసెస్ చేయగా 1838 రిజెక్ట్ అయ్యాయి. 11,094 దరఖాస్తులు షాట్పాల్ అయ్యాయి. 3363 దరఖాస్తులను ఫీజు చెల్లించాలంటూ లెటర్లు ఇచ్చారు. 127 అప్లికేషన్లకు ఫైనల్ అప్రూవుడ్ ప్రొసిడింగ్స్ ఇచ్చారు. వీటితో ప్రభుత్వానికి రూ.38,14,362 ఆదాయం వచ్చింది. ఇక వచ్చిన దరఖాస్తులన్నింటనీ పరిష్కరిస్తే కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి.