బాసర : అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లికి చెందిన 30 కుటుంబాల కాలనీ వాసులు. గత నాలుగు రోజుల నుండి కాలనీలో మంచినీరు రావడంలేదని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని కాలనీవాసులు అధికారులపై మండిపడుతున్నారు.
గంటల తరబడి ఆయా నీటి పంపుల వద్ద పనులు మానుకొని మంచి నీటి కోసం వేచి చూస్తున్నామని తమ పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో పిల్లలు స్నానాలు చేయకుండా అలానే పంపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీకి తాగునీరు సరఫరా చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.