ంచిర్యాల, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్‌లో వెలుగులోకి వస్తున్న అక్రమాల వ్యవహారంలో స్థానికంగా అగ్గి సెగలు రగులుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో లొసుగుల ఆధారంగా తనది కాని బ్యాంకులకు తనఖా ఉన్న భూములను అక్రమార్గంలో పొంది.. ఆ భూములనే తిరిగి సర్కారుకు అమ్మేసేందుకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే చేసిన కుట్రలు.. సర్కారు పెద్దలతో కలిసి చేసిన సీక్రెట్ ఏరియల్ సర్వేలు.. 10 వేల ఎకరాల భూ సేకరణ వెనకున్న వేల కోట్ల అక్రమాల కథలు..
ఇలా ఒక్కొక్కటిగా బయటపడుతున్న క్రమంలో ఆదిలాబాద్‌లోనే ఏడెకరాల అసైన్భూమితోపాటు మరో మూడెకరాల సర్కారు భూమిని చెరబట్టారనే వార్తలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్‌కు తనఖా భూములు అప్పగించి పరిహారం నొక్కేసి, తన తడాఖా చూపిద్దామనుకున్న సదరు నేత, ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసవర్గావ్లో నిషేధిత జాబితాలోని భూములను తన కుటుంబ సభ్యులు, బినామీల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో మరోసారి స్థానిక ఎమ్మెల్యే వార్తల్లో నిలిచారు.

ఈ భూములన్నీ ప్రొహిబీటెట్ ప్రాపర్టీనే..
రాష్ట్రంలో ప్రభుత్వ భూములతోపాటు అనైన్డ్ భూము లు, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, వక్ఫ్‌బోర్డు, సీలింగ్, కోర్టు కేసుల్లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలకు అటాచ్మెంట్ ఇచ్చిన భూములకు సంబంధించి కచ్చితమైన లెక్కలు లేవు. ఇలాంటి భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండలాలవారీగా సెక్షన్ 22ఏ కింద ఉన్న నిషేధిత భూముల జాబితాను రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగిస్తుంది. వాటి ఆధారంగానే నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే నిషేధిత జాబితాలోని భూముల వివరాలు గందరగోళంగా ఉంటాయని ఎంఆర్వోలు ఇచ్చే జాబితా ఒకలా, ఆర్డీవో, కలెక్టర్లు ఇచ్చే జాబితాలు మరోలా.. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంటాయని, దీంతో తప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఓ కేసు విచారణలో భాగంగా గుర్తించిన హైకోర్టు.. నిషేధిత జాబితాను ప్రక్షాళన చేయాలని ఆదేశించింది.
రిజిస్ట్రేషన్ చట్టం 1908, సెక్షన్ 22ఏ పరిధిలోని నిషేధిత భూముల వివరాలు సేకరించి.. అస్తవ్యస్తంగా ఉన్న నిషేధిత భూముల జాబితాను పటిష్ఠం చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, సీసీఎల్ఏ కమిషనర్లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిషేధిత జాబితాలోని భూముల వి వరాలన్నీ రిజిస్ట్రేషన్ శాఖకు ఇ వ్వాలని కలెక్టర్లను ఆదేశించిం ది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు మండల రెవెన్యూ అధికారులకు, హైకోర్టు నుంచి వ చ్చిన ఆదేశాలు, ప్రభు త్వ నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి నిషేధిత జాబితా భూ ముల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ మేరకు తహసీల్దార్లు రిపోర్టు తయా రు చేసి పంపారు. దాన్ని ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) కలెక్టర్లు క్రాస్‌చెక్ చే సుకొని సంతకాలు చేసి, రెవె న్యూ డిపార్ట్మెంట్కు అప్పగించారు. ఆ రిపోర్ట్‌నే రిజిస్ట్రేషన్ శాఖకు అందజేశారు. ఇ లా 2025 డిసెంబర్ 19వ తేదీ నే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిషేధిత భూముల జాబితా వివరాలు వెళ్లాయి. అందులో ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని బట్టిసవర్గావ్లో సర్వే నంబర్లు 72/3లో ఐదు ఎకరాలు, 72/3/1లో ఎకరం 20 గుంటలు, 72/3/2లో 1.27 గుంటలు మొత్తం 8.07 ఎకరాల భూమి ఉంది. సీ. దేవన్న, వీ.వెంకటేశం, వై సుధాకర్‌రెడ్డి, ఆశన్న, సత్యనారాయణకు అనైన్ చేసిన భూములన్నింటినీ.. ప్రొహిబీటెడ్ లిస్టులో ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు పంపించిన నివేదికపై ఎంఆర్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ, కలెక్టర్ నలుగురు అధికారులు సంతకాలు చేసి మరీ పంపించారు.

ఆరు నెలల్లోనే రిజిస్ట్రేషన్ ఎలా?
అధికారులు ప్రభుత్వానికి పంపించిన ప్రొహిబీటెడ్ లిస్ట్(నిషేధిత జాబితాలోని) భూముల వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకు ఇప్పటికే అందజేశారు. ఇలా ఆదిలాబాద్ వివరాలు వెళ్లి ఆరు నెలలు గడవక ముందే గత నెల జూన్ 12వ తేదీన ఒకేరోజు సర్వే నంబర్ 72/3లోని భూములు స్థానిక ఎమ్మెల్యే బంధువులు, బినామీల పేర్లపైకి రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఒకటీ రెండు కాదు ఏకంగా 11 డాక్యుమెంట్లు (ప్లాట్స్) రిజిస్ట్రేషన్ అయ్యాయి. ప్రొహిబీటెడ్ లిస్ట్‌లో ఉన్న ఈ భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఓ ప్రజాప్రతినిధి అయి ఉండి.. ఇలా నిషేధిత జాబితాలోని భూములను వదలకుండా కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2010లో ఈ భూములను ఓ రైతుకు అసైన్ చేశారు.
రైతు వారసుల నుంచి నాలుగు బై నంబర్లతో సొసైటీ పేరుతో కొందరు వ్యక్తులు కొనుగోలు చేశారు. అసైన్డ్ భూమిని నిబంధనల ప్రకారం వ్యవసాయ అసరాలకే వినియోగించాలి. కానీ.. నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్ చేశారు. గతంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ భూమి 1958కి ముందే అసైన్ అయ్యిందని, అది ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చట్టం కిందికి రాదని రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీ తీసుకున్నారు. కొంత కాలానికి జరిగిన పొరపాటును గుర్తించిన ప్రభుత్వం, ఆ ఎన్వోసీని రద్దు చేసింది. కాగా 2001లోనే 25 ఏళ్ల కిందటి స్థానిక సర్పంచ్ పేరు, పంచాయతీ అధికార ముద్రతో ఓ లే ఆవుట్ మ్యాప్ తయారు చేసొ పెట్టుకొని, చట్టబద్ధంగా లే అవుట్ చేసే అవకాశం లేని ఈ భూములను..
ఎన్వోసీ రద్దు చేసిన విషయాన్ని దాచి పెట్టి, అంతకుముందు ఇచ్చిన ఎన్వోసీ ఉందని చెబుతూ ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఇలా అసైన్డ్ భూముల్లో లే అవుట్లో వేయడంపై కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ సదరు సర్వే నంబర్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దని అధికారులను ఆదేశించారు. కాగా, గత కొన్ని రోజులుగా ఈ భూములపై కన్నేసిన సదరు ప్రజాప్రతినిధి.. కలెక్టర్ ఆదేశాలు, ప్రొహిబీటెడ్ జాబితాలోని భూములను గుట్టుచప్పుడు కాకుం డా.. కుటుంబ సభ్యుల పేరుపైకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈ ప్లాట్ల విలువ దాదాపు రూ.5 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తుంది. దీంతో ఆ నాయకుని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరపాలి
– కలెక్టర్, ఎస్పీలకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు
మావల మండలం బట్టిసవర్గావ్లోని 72 బై 3 జరిగిన 11 అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరుపాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి లేఖలో కోరగా, పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం జారీచేసిన ఎన్వోసీ రద్దుపై పలువురు నాయకుల హస్తం ఉందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నూతన కలెక్టర్ కార్యాలయం భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో జరిగిన భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎస్పీని కలిసిన వారిలో ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోశ్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇజ్జిగిరి సంజయ్, నాయకులు భిజర్ పాషా, కౌన్సిలర్లు అన్నపూర్ణ, మహబూబ్, నాయకులు బండారి సతీశ్, శాంతన్‌రావు, మంగేశ్, రషీద్, మంచాల మల్లయ్య ఉన్నారు.