ఆదిలాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) ః ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను దసరా పండుగ లోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పెద్ద ఎత్తుగా ఆందోళనలు నిర్వహిస్తామని, పార్టీ నాయకులు హాజరవుతారని తెలిపారు. రూ.2 లక్షల పంట రుణాల మాఫీ విషయంలో సీఎం రైతులను మోసం చేశాడని, అన్నదాతలను అవమానించేలా ప్రకటనలు చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసినట్లు ప్రధానికి లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో మిగిలిన 20 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఎప్పుడు బ్యాంకు లోన్‌ను రద్దు చేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ విషయంలో సీఎం, మంత్రుల ప్రకటనలకు పొంతన ఉండడం లేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు వదిలే ప్రసక్తే లేదన్నారు. రుణమాఫీ అనంతరం రైతుభరోసా అందిస్తామని మంత్రి అంటున్నారని వానకాలం ముగిసినా రైతుభరోసా డబ్బులు ఎప్పుడు బ్యాంకు ఖాతాల్లో వేస్తారో తెలుపాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ వస్తే సెగ తగులుతుంది..
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రుణమాఫీ విషయంలో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని, రైతుల నుంచి వ్యతిరేకత లేదని అంటున్నాడని జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో 5,500 మంది రైతులకు రూ.550 కోట్ల రుణమాఫీ జరిగిందని, ఇంకా 8 వేల మందికి మాఫీ కావాల్సి ఉందన్నారు. మంత్రి తుమ్మల ఆదిలాబాద్ పర్యటనకు వస్తే రైతుల సెగ తెలుస్తుందన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో రాహుల్‌గాంధీ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించారన్నారు.
ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను దేనితో కొడితే దెబ్బతగులుగుతుందో తెలుపాలన్నారు. రుణమాఫీ కాని రైతుల ఇంటికి వెళ్లి సర్వే చేసి రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా 3,200 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, పంట నష్టపోయిన రైతులకు రూ. 10 వేల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఫలితం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా సోయాబిన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రోకండ్ల రమేశ్, మెట్టు ప్రహ్లాద్, విజ్జగిరి నారాయణ, యాసం నర్సింగరావు, కుమ్ర రాజు, నవాతే శ్రీనివాస్, ఆసిఫ్ ఉన్నారు.