Liquor | చింతలమనేపల్లి : మార్చి3న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వైన్స్ షాపులు మూసేవేసిన తర్వాత కోడ్ విరుద్ధంగా గూడెం వైన్స్ షాప్ వద్ద అక్రమంగా నిలువ ఉంచిన మద్యాన్ని ఆ ఎన్నికల సమయంలో అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. అయితే ఆ మద్యాన్ని ఎస్పీ కాంతిలాల్ సుభాష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్, కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం సమక్షంలో బుధవారం చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్లో రోడ్డు రోలర్ తో లిక్కర్ బాటిళ్లను తొక్కించి ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన ఆ మద్యం విషయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చివారి అనుమతితో మద్యం బాటిళ్లు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే పనులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. బాటిళ్ల కాలం ముగిసిందని అందుకే వాటిని డిస్మెటల్ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ధవ్లత్, కౌటాల సీఐ ముత్యం రమేశ్, ఎక్సైజ్ సీఐ రవి, ఎస్ఐలు ఇస్లావత్ నరేశ్, కళ్యాణ్, సీనియర్ అసిస్టెంట్ జాఫర్, పొలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.