బెజ్జూర్, అక్టోబర్ 27 : బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు శనివారం సోమిని గ్రామంలో ఎర్రబండ రేవు వద్ద ప్రాణహితనదిలో ఈతకు వెళ్లి గల్లంతవగా అందులో ఇద్దరి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. గల్లంతైన వారి కోసం ఆదివారం ఎస్ఐ విక్రమ్ ఆధ్వర్యంలో పోలీసులు, గజ ఈతగాళ్లు కుటుంబ సభ్యులు గాలించగా తలాయి గ్రామ సమీపంలో ప్రాణహిత నదిలో ఉదయం మత్స్యకారుల వలకు జహీర్ హుస్సేన్(23) మృతదేహం చిక్కింది. మరో ఇద్దరి కోసం మహారాష్ట్ర రెస్క్యూ టీం, బెజ్జూర్ పోలీసులు గాలిస్తుండగా సాయంత్రం అక్కడే ఇర్షాద్(20) మృతదేహం లభ్యమైంది. మరో యువకుడు మోహిజ్(19) కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ..
మండలంలోని సోమిని ఎర్ర బండ ప్రాంతంలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతైన విషయం తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదివారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ పష్పలత, చింతలమానేపల్లి మాజీ ఎంపీపీ నానయ్య, టీపీసీసీ సభ్యుడు అర్షద్ హుస్సేన్, పీఏసీఎస్ చైర్మన్ ఓం ప్రకాశ్, తదితరులున్నారు.