గ్రామాల్లో రీడింగ్ కల్చర్.. నీరుగారింది. కేసీఆర్ ప్రభుత్వం లక్షలాది రూపాయలతో పౌరుల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ లైబ్రరీ నిరుపయోగంగా మిగిలిపోయింది. నేటి పాలకుల పట్టింపులేని తనం.., అధికారుల నిర్లక్ష్యం తాళ్లపేట గ్రంథాలయానికి శాపంగా మారింది. ఇక్కడ పుస్తకాలు, పిరియాడికల్స్ అందుబాటులో ఉన్నా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు, నాయకులు పట్టించుకొని ఉపయోగంలోకి తేవాలని ప్రజలు, పోటీ పరీక్షల అభ్యర్థులు కోరుతున్నారు.
దండేపల్లి, మే 19 : గ్రామాల్లో రీడింగ్ కల్చర్ ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం నడుంబిగించింది. పౌరుల భవిష్యత్‌ను పెటుటకొని పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నిరుపయోగంగా ఉన్న భవనాలను గుర్తించి, మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెచ్చింది. దండేపల్లి మండలం తాళ్లపేటలో నిరుపయోగంగా ఉన్న జీసీసీ భవనాన్ని రూ.3.50 లక్షలతో మరమ్మతులు చేయించింది. దీనిని లైబ్రరీగా మార్చింది.
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గతేడాది జూన్ 20న అప్పటి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, అదనపు కలెక్టర్ రాహుల్ ప్రారంభించారు. కానీ, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షలాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా మిగిలిపోతున్నాయి. నేటి పాలకులు దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. అదనపు కలెక్టర్ రాహుల్ ప్రత్యేక పర్యవేక్షణలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలను అప్పట్లో నూతన లైబ్రరీల కోసం వినియోగించారు. ఒక్కో లైబ్రరీ కోసం రూ.3.5లక్షకు పైగా ఖర్చు చేశారు. గ్రంథాలయంలో పుస్తకాలు, పీరియాడికల్స్ అందుబాటులో ఉన్నా ఫలితం లేకుండా పోతున్నది.
వసతులున్నా ఫలితం శూన్యం..
గ్రంథాలయాల్లో టేబుళ్లు, కుర్చీలు, లైట్లు ఏర్పాట్లు చేశారు. అన్ని వయసుల వారు చదువుకునేలా తీర్చిదిద్దారు. ప్రారంభమై ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు తెరిచి ఉంచకపోవడంతో విద్యార్థులు, యువకులు నిరుత్సాహ పడుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో నిరుద్యోగులకు సైతం ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. పాఠకుల అభిరుచి మేరకు మరిన్ని పుస్తకాలు కొనుగోలు చేసి, లైబ్రరీని ప్రతిరోజూ తెరిచి ఉంచాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.