మంచిర్యాలటౌన్, మే 26: మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, సమయం, స్థలం చెప్పాలని ఎమ్మెల్యే పీఎస్సార్‌కు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సవాల్ విసిరారు. సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ జర్నలిస్టు మునీర్‌కు బీఆర్ఎస్ పార్టీ తరఫున రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దివాకర్‌రావు మాట్లాడుతూ అభివృద్ధితో పాటు అవినీతి, అక్రమాలు, రౌడీయిజం, అక్రమ కేసులపైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అసలు అవినీతి, అబద్ధాలు అంటేనే పీఎస్సార్ అని అన్నారు. మంచిర్యాల-అంతర్గాం వంతెన విషయంలో పీఎస్సార్ రోజుకోరకంగా మాట్లాడుతున్నాడని, ముందు తనకు అంతర్గాంలో భూములు ఉన్నాయని చెప్పారని, తర్వాత వంతెన చిన్నదిగా నిర్మిస్తే ఉపయోగం ఉండదని, ఆ తర్వతా అప్రోచ్‌రోడ్లు లేవని రకరకాలుగా మాట్లాడుతున్నారని అన్నారు.
ప్రజల బలమైన కోరిక అయిన ఈ వంతెనను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. గోదావరిపై నిర్మించిన వంతెనల్లో ఎక్కడా 132 ఫీట్లు వెడల్పుతో రోడ్లు లేవని, 66 ఫీట్ల రోడ్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. లక్ష్మీటాకీసు నుంచి పాతమంచిర్యాల వరకు ఆరు లైన్ల రహదారి ని ర్మాణంతో చాలామంది ఇండ్లు దెబ్బతింటాయని, అస లు రహదారులు నాలుగు వరుసలు ఉంటే పట్టణం మ ధ్యలో నిర్మించే రోడ్డు ఆరు వరుసలు నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎంత అభివృద్ధి చేయాలో అంతా చేశానని అన్నారు. మంచిర్యాలలో రూ.14 కోట్లతో బైపాస్‌రోడ్డు నిర్మించామని, పాతమంచిర్యాల నుంచి క్వారీరోడ్డు వరకు రోడ్డు నిర్మాణం, రైల్వే స్టేషన్ నుంచి రాజీవ్‌నగర్ వరకు, తిలక్‌నగర్‌కు, ఇటు గోదావరి నది వరకు రోడ్లు నిర్మించానని అన్నారు. రెండు అండర్‌గ్రౌండ్ బ్రిడ్జిలు నిర్మించామని, ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ తన హయాంలో నిర్మించినట్లు తెలిపారు.
పీఎస్సార్ పుట్టిన కాసిపేట మండలంలో 13 నీటి ప్రాజెక్టులు ప్రారంభించామని, దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో భూములు కోల్పోయిన 20 మంది గిరిజనులకు అందులోనే ఉద్యోగాలు పెట్టించినట్లు తెలిపారు. మంచిర్యాలలో 24 ఎకరాల భూదాన్ భూమిని పీఎస్సార్ అనుచరులు కబ్జాచేసేందుకు ప్రయత్నిస్తే తాను అడ్డుకున్నానని, మార్కెట్ కమిటీ స్థలాన్ని కాపాడానని, రాజీవ్‌నగర్‌లో 120 ఎకరాలకు పైగా భూమిని పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
రెడ్‌క్రాస్ అనాథాశ్రమం ఏరియాలో స్థలం కబ్జాకు కాకుండా కాపాడడంతో అక్కడ ఇప్పుడు ఎక్సైజ్, ఇరిగేషన్ కార్యాలయాలు, వాటర్‌ట్యాంకు నిర్మించుకోగలిగామని తెలిపారు. పాత మంచిర్యాల నుంచి రసూల్‌పల్లి వరకు రహదారి వెడల్పు చేసినట్లు తెలిపారు. తన కొడుకు విజిత్‌రావును ఏఎస్పీ పిలిచారని పదేపదే అంటున్న ఎమ్మెల్యే ఆ విషయాన్ని ఏఎస్పీతోనే చెప్పించాలని డిమాండ్ చేశారు. కేసుల భయంతో మూడునెలలు పారిపోయిన చరిత్ర పీఎస్సార్దేనని అన్నారు.
గెలిచిన నాటి నుంచి అక్రమాలే..
ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి పీఎస్సార్ అన్నీ అక్రమాలే చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. రూ.4 కోట్లతో నిర్మించాల్సిన వైకుంఠధామా న్ని రూ. 12 కోట్లకు పెంచారని, గోదావరిలో ఏడు గుం టలకు అనుమతి తీసుకుని రెండు వేల టిప్పర్ల మట్టిని తరలించారని, మట్టిని తవ్వాక అనుమతులు తీసుకున్నారని అన్నారు. వేంపల్లి, పోచంపాడ్ గ్రామాల్లో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుల పేరి ట తక్కువ ధరలకు భూములను తీసుకుని రూ. 200 కోట్ల భారీ అవినీతికి స్కెచ్ వేశారని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని కాప్రాలో వందలాది మం ది కొనుగోలు చేసిన ప్లాట్లను కబ్జాచేశారని, వారంతా సెక్రటేరియట్ ఎదుట, డిప్యూటీ సీఎం ముందు గోడు వెల్లబోసుకున్నారని, పలుమార్లు ధర్నాలు చేశారని గుర్తుకు చేశారు. అసలు పీఎస్సార్‌కు చిరాన్‌పోర్టు క్లబ్ ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. రూ. 1400 కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టావో చెప్పాలని డిమాండ్ చేశారు. మోసం, దగా, అక్రమం, అన్యాయంతోనే ఇవన్నీ సాధ్యపడుతాయన్నారు.
అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతూ ఆ పాపం తగులుతుందని, భవనాలను కూలగొట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, అ శాంతిని నెలకొల్పేందుకు ఎమ్మెల్యేగా గెలిచావా ? అని ప్రశ్నించారు. టెండర్లలో కాంట్రాక్టర్లను పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమ మనుషులతో ఎక్సెస్ టెండర్లు వేయించి తొమ్మిది శాతం కమీషన్‌ను తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, బీజేపీల్లో చేరాలని ప్రయత్నించారని, వాళ్లు తిరస్కరించడంతో గత్యంతరం లేకనే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారని అన్నారు.
బీజేపీ రఘునాథ్వి అహంకారపు మాటలు
బీజేపీ నాయకుడు రఘునాథ్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని, ఆయన మాటలే అతని పతనానికి కారణమవుతాయని దివాకర్‌రావు అన్నారు. విదేశాల్లో ఉన్న మీకు వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఏదైనా కంపెనీని ముంచితే తప్ప అంతడ బ్బు రాదని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయడాన్ని అందరం సంతోషించామని, అయితే మోడీ అ ర్థాంతరంగా యుద్ధాన్ని ఆపేయడాన్నే ప్రశ్నించామన్నా రు.
యావత్ దేశం కూడా ఈ విషయంలో తప్పపట్టిందన్నారు. బీజీపీ నాయకులు వందేభారత్ రైలుకు మం చిర్యాలలో స్టాప్ కల్పించలేదని, మెడికల్ కాలేజీ తీసుకురాలేదన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజ య్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్‌రావు, నాయకులు గాదెసత్యం, పల్లె భూమేశ్, బేర సత్యనారాయణ, గోగుల రవీందర్‌రెడ్డి, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, మొగిలి శ్రీనివాస్, అక్కూరి సుబ్బయ్య, వెంకటేశ్, శ్రీపతివాసు, శ్రీరాముల మల్లేశ్, తాజుద్దీన్ పాల్గొన్నారు.