నిర్మల్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : వ్యవసాయ భూముల రక్షణ కోసం కేసీఆర్ ముందుచూపుతో ధరణిని తీసుకొచ్చారు. కేసీఆర్ పాలనలో ధరణి పోర్టల్ పారదర్శకంగా సేవలందంచి అనేక భూ సమస్యలను పరిష్కరించింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు గత జూన్ 2 నుంచి 19వ తేదీ వరకు అధికారులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా సదస్సుల్లో వేలాదిగా దరఖాస్తులు రాగా.. పరిష్కరించేందుకు ఆగస్టు 15వ తేదీ వరకు గడువు విధించారు. ప్రభుత్వం విధించిన గడువు మరో మూడు రోజులే మిగిలి ఉండగా, వచ్చిన దరఖాస్తుల్లో 15 శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదు. దరఖాస్తులన్నీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నాయి.
9,500 మందికి నోటీసులు జారీ
నిర్మల్ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సదస్సుల్లో రైతుల నుంచి 16,855 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు కేవలం 2,600 దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం అయ్యాయి. వచ్చిన దరఖాస్తులకు సంబంధించి 9,500 మందికి నోటీసులు జారీ చేశారు. కొన్ని సమస్యలను అసలే పరిష్కరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో నుంచి దాదాపు 4 వేల దరఖాస్తులను తాము పరిష్కరించలేమంటూ అధికారులు చేతులెత్తేయడం విమర్శలకు తావిస్తున్నది.
తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. అర్జీలు పెట్టుకున్న రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని నిత్యం కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా వారి గోడు పట్టించుకునే వారే కరువయ్యారు. కాగా వచ్చిన దరఖాస్తుల్లో మిస్సింగ్ సర్వే నంబర్లు, సాదాబైనామా, సవరణలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అయితే ఇందులో ఎలాంటి వివాదాలు లేని సులువుగా పరిష్కరించగలిగిన పెండింగ్ మ్యూటేషన్లు, డీఎస్ పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు.
నా పేరు మీద పట్టాకాలే..
మాది మామడ మండలంలోని కొరిటికల్ గ్రామం. మా తల్లి జంగం లక్ష్మీ పేరు మీద కొరిటికల్ శివారులోని సర్వే నంబర్ 1096 లో 22 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ భూమిలోనే ఏండ్ల సంది పంటలు పండించుకుంటున్నం. మా తల్లికి నేను ఒక్కదాన్నే వారసురాలిని. నా పేరు మీద ఇప్పటిదాకా పట్టా కాలేదు. పట్టా చేయాలని సార్లకు చాలాసార్లు దరఖాస్తు ఇచ్చినం. అయినా పని అయితలేదు. ఈ వయసులో ఆఫీసుల సుట్టూ తిరుగుతున్నా నామీద ఎవరికీ దయ కలుగుతలేదు.
– జంగం గంగవ్వ, కొరిటికల్, మామడ మండలం.
ఇతరుల పేరుపై పట్టా చేశారు..
మా తండ్రి సముందర్పెల్లి రాజన్న 2013లో చనిపోయిండు. ఆయన పేరు మీద నిర్మల్ శివారులోని సర్వే నంబర్ 1472లో 9 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. అలాగే దాని పక్కనే మరో సర్వే నంబర్ 1464లో 11 గుంటల భూమి ఉన్నది. మా తండ్రి చనిపోయిన తర్వాత తల్లి పోష వ్వ పేరుపై భూమిని బదలాయించాలని దరఖాస్తు చేసుకో గా, 9 గుంటలు మాత్రమే మార్పిడీ చేసి పట్టా ఇచ్చారు.
ఇంకా 11 గుంటల భూమి ని మా తల్లి పోషవ్వ పేరుపై కాకుండా ఎవరో రేణుక పేరు మీద పట్టా చేశారు. ఆ మె ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియదు. అధికారుల పొర పాటు కారణంగా జరిగిన తప్పును కూడా రెక్టిఫై చేయలేకపోతున్నారు. మా తల్లి పోషవ్వ పేరు మీద పట్టా మార్పిడి చేయాలని గత జనవరి నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటీవల భూభారతిలో కూడా దరఖాస్తు చేసుకున్నా. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
– సముందర్పెల్లి అశోక్, నిర్మల్.