బేల, అక్టోబర్ 28 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఎంఆర్ఐ తీయడానికి కంటే ముందు వేయాల్సిన కాంటెస్ట్ ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడంతో ఆదివాసీ మహిళ సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ లెగు పోతుబాయి(45) పక్షం రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు రిమ్స్‌లో అడ్మిట్ చేశారు.
ఈమెకు ఎంఆర్ఐ తీయాలని వైద్యులు సూచించారు. కానీ.. ఎంఆర్ఐ తీయడాని కంటే ముందు కాంటెస్ట్ ఇంజక్షన్ వేయాలి. ఇదీ రిమ్స్‌లో అందుబాటులో లేదు. ప్రైవేటుగా కొనుగోలు చేస్తామంటే రూ.9 వేలు కావడంతో పోతుబాయి కుటుంబ సభ్యులు కొనుగోలు చేయలేక ఇంటికి వెళ్లారు. దీంతో ఆమెను కుటుంబీకులు రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోతుబాయి సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది.