నిర్మల్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా జరుగుతున్న నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నష్టం అంచనా రూపకల్పనలో యంత్రాంగం విఫలం కావడంతో నష్టపోయిన బాధితులకు న్యాయమైన పరిహారం అందడం అనుమానంగా ఉంది. నెలల తరబడి రోడ్లు, వంతెనలకు మరమ్మతులు లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఈ క్రమంలో వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా అతలాకుతలమైంది. చాలా చోట్ల పొలాలు నీట మునగడమే కాకుండా, వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఆస్తినష్టం కూడా సంభవించింది. కొన్నిచోట్ల లో లెవెల్ వంతెనలు, కల్వర్టులకు కూడా వాటిల్లింది. కొన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు జరపకుండానే కిందిస్థాయి సిబ్బంది అందించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని కాకిలెక్కలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు సమాచారం.
స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే నష్టం అంచనాలను సక్రమంగా రూపొందించలేకపోతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అధికారుల గాలి లెక్కల కారణంగా క్షేత్రస్థాయిలో నష్టం కొండంత జరిగితే.. బాధితులకు పరిహారం మాత్రం గోరంత అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రితోపాటు, అధికారులు బాధితులందరికీ నష్ట పరిహారం అందిస్తామని హామీలు గుప్పిస్తున్నారే తప్ప.. ఎక్కడ కూడా ఆ హామీలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఇప్పటి వరకు నయాపైసా కూడా బాధితులకు అందించలేదన్న విమర్శలు ఉన్నాయి.
భారీ నష్టం ఇలా..
జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి దిగువకు పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుల దిగువన నదీ పరీవాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు తమ వద్దకు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుంటాల మండలం లింబా(కే) గ్రామంలో భారీ వర్షాలకు దృపతాబాయి అనే మహిళకు చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. వర్షాలతో నిరాశ్రయురాలైన ఆమెకు ఆదుకుని ఆశ్రయం కల్పించాలని కోరుతున్నారు. ఇదే మండలంలో భారీ వర్షాల కారణంగా వెంకూర్ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో లో లెవెల్ వంతెనపై నుంచి వరదనీరు పారింది. దీంతో పాతవెంకూర్, విఠాపూర్, పెంచికల్‌పాడ్ గ్రామాలకు మూడు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి.
అలాగే ఓలా నుంచి సూర్యాపూర్ గ్రా మాల నడుమ కూడా లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు పొంగి పారింది. దీంతో ఓలా నుంచి సూర్యాపూర్, మెదన్‌పూర్, మెదన్‌పూర్ తాండ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సిద్ధాపూర్ శివారులోని స్వర్ణ వాగుపై గల లోలెవల్ వంతెన సైతం నీట మునిగింది. దీంతో కౌట్ల(కే), ముజ్గి, సిద్దులకుంట, తాంశ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి ఈ మూడు చోట్ల రోడ్డు పైనుంచి వాగులు ప్రవహిస్తుండడం ఆయా గ్రామాలకు శాపంగా మారుతున్నది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు ఆయా చోట్ల లో లెవల్ వంతెనల స్థానంలో శాశ్వత పరిష్కారాకి కొత్త వంతెనలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిధులు మంజూరు చేయాలి..
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల మూడు రోజులపాటు కురిసిన అతి భారీ వర్షాల కారణంగా రోడ్లు భవనాల శాఖ పరిధిలో నాలుగు వంతెనలు, 61 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వాటి మరమ్మతు కోసం రూ.45 లక్షలతో అంచనాలు రూపొందించిన అధికారులు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు.
నిజం.. ఇదీ పత్తి చేనే!
పై ఫొటోను చూస్తుంటే.. వాగులోని ఇసుక రాశుల మాదిరిగా కనిపిస్తుంది కదూ.. మీరు అలా అనుకుంటే పొరపడినట్టే.. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వాగులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరింది. వీటి తీర ప్రాంతాల్లో వేసిన చేలలో ఇసుక మేటలు వేశాయి. దీనికి నిదర్శనమే ఈ చిత్రం.. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని పూసాయికి చెందిన రైతు భూమన్న తనకున్న పదకొండెకరాల్లో పత్తి, సోయా వేశాడు.
వాగులు పొంగడంతోపాటు ఏడెకరాల్లో పెన్‌గంగ ఉధృతి కారణంగా పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. చేనులో ఇసుక మేటలు వేసి పంట పూర్తిగా కప్పివేసింది. దీంతో పత్తి, సోయా పంటల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు నీటిపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రూ.3.50 లక్షలు అప్పులు చేసి సాగు చేసిన పంటలు నష్టపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అని మదనపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.
– నమస్తే తెలంగాణ ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్.