మంచిర్యాల అర్బన్/రామకృష్ణాపూర్, జనవరి 9 : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూలీ మృతి చెందాడని, అతడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ రహదారిపై బంధువులు రాస్తారోకో నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం బలగల గ్రామానికి చెందిన రావుల సురేష్(35) విద్యుత్ పనులు నిర్వహించే ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా పని చేస్తున్నాడు.
విధుల నిమి త్తం బుధవారం రాత్రి రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి చెరువు వద్ద విద్యుత్ స్తంభం కొలతల కోసం పైకి ఎక్కాడు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్ తగిలి స్తంభం పై నుంచి కిందపడ్డాడు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన వద్ద జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు, బంధువులు రాస్తారోకో నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే సురేష్ మృతి చెందాడని, అతడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అకడికి చేరుకొని ట్రాఫిక్‌ను మళ్లించారు. అధికారులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.