కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పేదల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు వరంలా మారింది. కొందరు దళారులు మాఫియాగా ఏర్పడి అడ్డదారుల్లో మహారాష్ర్టకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలుచోట్ల ప్రత్యేకంగా దుకాణాలు పెట్టి మరీ రూ. లక్షల్లో దందా సాగిస్తుండగా, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. దళారులు సేకరించిన రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి.. అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి మరీ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. సిర్పూర్-టీ మండలం వెంట్రావ్పేట్, వాంకిడి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఈ దందాకు అడ్డాలుగా మారాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. ఈ సమయంలో ఆసిఫాబాద్, రెబ్బెన, బూరుగడ, వాంకిడి, కాగజ్‌నగర్, తదితర ప్రాంతాల్లో కిలోకు రూ. 15 చొప్పున కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని వీరూర్‌లో రూ. 20కి విక్రయిస్తారు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని గొందియాకు బియ్యాన్ని సరఫరా చేస్తారు. గొందియా, బల్లార్షాల్లోని రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేసి పాలిష్ చేస్తారు. ఆపై కిలోకు రూ. 30 నుంచి రూ. 35 చొప్పున విక్రయిస్తారు.
ఇప్పటిదాకా పెద్ద వాహనాల్లో వీరూర్‌కు బియ్యాన్ని తరలించిన వ్యాపారులు.. ఇటీవల తమ విధానాన్ని మార్చుకున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చిన్న వ్యాన్లలో బార్డర్‌లోని వెంకట్రావ్‌పేట్ వరకు తరలించి అక్కడ గోదాముల్లో డంప్ చేస్తారు. అక్కడి నుంచి భారీ వాహనాల్లో గొందియా, బల్లార్షాల్లోని రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. రోజుకు 50 టన్నులకు పైగా బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు తెలిసింది.
జిల్లాలో కొందరు దళారులు మాఫియాగా ఏర్పడి ప్రతి నెలా లక్షల్లో దందా సాగిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. గట్టి నిఘా ఏర్పాటు చేశామని అ ధికారులు చెబుతున్నా.. వివిధ మార్గాల్లో రేష న్ బియ్యాన్ని తరలిస్తూనే ఉన్నారు. సిర్పూర్-టీ, కౌటాల మండలాల్లో వారం వ్యవధి లో బియ్యం పట్టివేత ఘటనలు రెండు చోటు చేసుకున్నాయి. సిర్పూర్-టీ నుంచి మహారాష్ట్రలోని వెంకట్రావ్‌పేట్‌కు తరలిస్తున్న 34.17 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన రెండు రోజులైనా గడవకముందే కౌటాల వద్ద మరో 10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.