కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆధునాతన వసతులు, నాణ్యతా ప్రమాణాలతో రాజసం ఉట్టిపడేలా జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించింది. భవన నిర్మాణం, వసతుల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సుమారు 18 ఎకరాల స్థలాన్ని కేటాయించగా 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 భవనాన్ని కట్టారు. ఇందులో సమారు 50 వరకు విశాలమైన గదులు ఉన్నాయి. అవసరాన్ని బట్టి గదుల్లో పార్టీషన్ చేసి, క్యాబిన్లు నిర్మించుకునేలా ఏర్పాటు చేశారు. భవన నిర్మాణానికి రూ.25 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. చూడగానే ఆకట్టుకునేలా ప్రత్యేక ఆకర్షణగా కట్టారు. భారీ గేట్లు, పచ్చదనం ఉట్టిపడేలా గార్డెనింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజల భద్రతకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా, రాజసం ఉట్టిపడేలా భవనాన్ని నిర్మించారు.