కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రౌడీ రాజకీయాలకు వేదికవుతున్నది. ఎన్నడూ లేని విధంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులను తప్పించేందుకు పలువురు బెదిరింపులకు పాల్పడుతుండడం ఆందోళన గురి చేస్తున్నది. గన్ పెట్టి బెదిరించడం.. ఆర్థికంగా నష్టపరచడం.. ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయడం వంటి విష సంస్కృతికి తెరలేపగా, సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. ఇటీవల చింతలమానేపల్లి మండలం రనవెల్లి గ్రామ పంచాయితీలో పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి జాడి దర్శనను పోటీలో నుంచి తప్పుకోవాలని, ఓ గుర్తు తెలియని వ్యక్తి సదరు అభ్యర్థి బంధువుకి దళం పేరుతో చేతిలో లేఖపెట్టడమేగాక ఏకంగా మెడపై గన్‌పెట్టి బెదిరించాడు.
దీంతో భయభ్రాంతులకు గురైన సదరు సర్పంచ్ అభ్యర్థి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తలపై గన్పెట్టిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు.. గన్ ఎలా వచ్చింది అనేది ఇంతవరకు గుర్తించలేకపోయారు. అలాగే రెండు రోజుల క్రితం బెజ్జూరు మండలం మర్థిడి గ్రామ పంచాయితీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ధారవత్ మహేశ్‌ను కొందరు బెదిరించారు. పైగా ఆయనకు చెందిన రెండెకరాల వరికుప్పలు తగులు బెట్టారు. ఇక తాజాగా జైనూర్ మండలం మార్లవాయి గ్రామ పంచాయితీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీల ఉన్న థర్డ్ జెండర్‌ను పోటీ నుంచి తప్పుకోవాలని, లేదంటే చంపేస్తామని ప్రత్యర్థి అభ్యర్థి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.