కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/బెల్లంపల్లి, డిసెంబర్ 28 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్పొరేట్ వైద్యసేవలకు కేరాఫ్‌గా మారుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 50 పడకల దవాఖాన అందుబాటులోనికి రావడంతో.. 100 పడుకలతో ఏరి యా దవాఖాన నిర్మాణం జరుగుతోంది. ఇటీవలే ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కళాశాలను రూ.1000 కోట్లతో ప్రకటించింది.
వచ్చే బడ్జెట్లో మెడికల్ కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించనుంది. డయాలసిస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్ అందుబాటులోనికి రావడంతో 20 పీహెచ్‌సీల పరిధిలోని రోగుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి రోగ నిర్ధారణ చేస్తూ.. సరైన చికిత్స, మందులు అందించే అవకాశం ఉంది. ఈ డయాగ్నస్టిక్ సెంటర్లో 57 రకాల పరీక్షలు నిర్వహించి, వ్యాధులను నిర్ధారణ చేస్తారు.
నేడు మంత్రి హరీష్‌రావు పర్యటన
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో రూ.5కోట్లతో నిర్మించిన 30 పడకల దవాఖానతోపాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కెమికల్ ఏరియాలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో రూ.12 కోట్లతో నిర్మించిన 100 పడకల దవాఖానను గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 10 గంటలకు కాగజ్‌నగర్ పట్టణంలో నిర్మించిన 30 పడకల దవాఖానను ప్రారంభిస్తారు.
ఆ తరువాత 11.30 గంటలకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్మించిన 100 పడకల ఆస్పత్రిని, డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 12 గంటలకు బెల్లంపల్లిలో ఏర్పాటు చేసే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. బెల్లంపల్లి పట్టణ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించనున్నారు. బెల్లంపల్లిలో భోజనం చేసిన అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కరీంనగర్ వెళ్లనున్నారు. కాగజ్‌నగర్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఏర్పాట్లను పరిశీలించారు.
బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఏసీపీ ఎడ్ల మహేశ్‌తో కలిసి పరిశీలించారు. సభా ప్రాంగణం, వీఐపీ గ్యాలరీ, ఇతర గ్యాలరీలను పర్యవేక్షించారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాగజ్‌నగర్, బెల్లంపల్లిలో జరిగే దవాఖానల ప్రారంబోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పూర్తిచేశారు. ప్రధానంగా కాగజ్‌నగర్‌లో దవాఖానలో ఎక్స్‌రే, డయాలసిస్, ఈసీ జీ, ఆల్ట్రాసౌండ్, స్కానింగ్ సేవలు అందుబాటులోనికి రానున్నాయి. రోగులకు సౌకర్యం కలుగడంతోపాటు రోగులపై ఆర్థి క భారం తగ్గనుంది. కాగజ్‌నగర్‌లో అధునాత వసతులతో వైద్యసేవలు అందుబాటులోనికి వస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.