కుమ్రం భీం ఆసిఫాబాద్, (నమస్తే తెలంగాణ)/రెబ్బెన, ఏప్రిల్ 1: అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత కొరడా ఝుళిపించారు. బుధవారం ఆసిఫాబాద్ పెద్ద వాగు, రెబ్బెన మండలం రాంపూర్ వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి ఏడు ట్రాక్టర్లను సీజ్ చేయించారు. అక్రమంగా ఇసుక దందా చేసే వ్యాపారులను హడలెత్తించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతకాలంగా వాగుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వ నిర్మాణాల పేరుతో ఇసుకను తరలిస్తున్న వ్యాపారులు ప్రైవేట్ నిర్మాణాలకు విక్రయిస్తూ కాసులు దండుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్న నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం పలు ప్రాంతాల్లో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కాగజ్నగర్ పెద్దవాగు ప్రాంతం నుంచి రెబ్బెన మండలంలోని రాంపూర్ గ్రామానికి ఎలాంటి అనుమతి పత్రాలు, ట్రాక్టర్ డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఆసిఫాబాద్ మండల పరిధిలో పెద్ద వాగు సమీపంలో ఆసిఫాబాద్ ఎస్ఐ జాడే శ్యామ్ రావు, కమలాకర్ నేతృత్వంలోని పోలీసు బృందం తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నదని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సహజ వనరులను దోపిడీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అక్రమంగా, అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తూ వ్యాపారం చేసే వారితో పాటు తరలించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక దోపిడీని అరికట్టేందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక నిఘా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.