ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, డిసెంబర్ 17: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్పీ శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి హాజరై జాతీయ రహదారుల, రోడ్లు భవనాల, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, రవాణా, పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాహనదారులకు తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులు, కల్వర్టులు, వంతెనల వద్ద ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని, అనుబంధ రహదారుల వద్ద వేగనియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 139 ప్రమాదాలు జరిగాయని, ఈ సంవత్సరం జనవరి నుంచి నవంబర్ వరకు 133 ప్రమాదాలు సంభవించాయన్నారు. అధికారుల సమన్వయంతో ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ ప్రభాకర్, రోడ్డు భవనాల శాఖ ఈఈ శైలేందర్, జిల్లా రవాణా శాఖ అధికారి రాంచందర్, జాతీయ రహదారుల సంస్థ, పంచాయతీ రాజ్, ఆర్టీసీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.