బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నిర్మల్ జిల్లా పర్యటన గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. మహిళలు, యువతీయువకులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ప్రసంగానికి మంత్రముగ్ధులై జైకొట్టారు. ప్రతిపక్షాలపై సెటైర్లు వేస్తుండడంతో యువత కేరింతలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీ సచ్చిన పీనుగ అనడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. తాము చేస్తున్న అభివృద్ధి పనులు నిజమైతే బీఆర్ఎస్కు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునివ్వడంతో మహిళలు చేతులు పైకెత్తి మద్దతు తెలిపారు. కాగా.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తనయుడు, బీఆర్ఎస్ యువనేత అల్లోల గౌతంరెడ్డి పర్యటన ఏర్పాట్లను అన్నీతానై పర్యవేక్షించారు. సభ సక్సెస్ కావడంపై పలువురు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు.
– నిర్మల్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ)
నిర్మల్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పర్యటించి జనాల్లో ఉత్సాహం నింపగా, బీఆర్ఎస్ శ్రేణులకు జోష్‌నిచ్చింది. జిల్లా వాసులంతా కేటీఆర్‌కు అడుగడుగా బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలకడం, అలాగే ఆయన చేసిన ప్రసంగాలకు జై కొట్టి సంబర పడడం బీఆర్ఎస్ వర్గాలను ఉత్సాహంలో నింపింది. కాగా నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు నిర్మల్‌తో పాటు ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి సైతం ప్రజలు పెద్ద సం ఖ్యలో తరలి వచ్చారు.
మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుంటూ చేసిన ప్రసంగాలు అందరిని ఆకట్టుకోగా, జనాలు సైతం అడుగడుగునా జై కొట్టారు. ఓ వైపు కార్యకర్తల్లో ఉత్సాహం నింపేరీతిలోనే కాకుండా, మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సైతం ఆయన తిప్పి కొట్టారు. గత పదేళ్లుగా తాము చేసిన అభివృద్ధి పనులు నిజమైతేనే బీఆర్ఎస్కు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునివ్వడంతో కాంగ్రెస్, బీజేపీలు డైలమాలో పడే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై రాజకీయ దురుద్ధేశంతో బీఆర్ఎస్ను బద్నామ్ చేయాలన్న లక్ష్యంతో ఈ రెండు ప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే ఈ తప్పుడు ఎత్తుగడలను మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో వ్యూహాత్మకంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ సచ్చిన పీనుగ అని కేటీఆర్ అనగానే జనమంతా చప్పట్లతో సభా ప్రాంగణాన్ని మారుమోగించారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీని సైతం కేటీఆర్ లక్ష్యంగా చేసుకొని ఎదురుదాడి కొనసాగించారు. నరేంద్రమోదీ జన్‌ధన్ పేరిట బ్యాంకు ఖాతాలున్న వారందరికీ రూ.15 లక్షలు జమ చేస్తామని హామీనిచ్చి విస్మరించారని అన్నారు. రూ. 15 లక్షలు ఖాతాల్లో పడ్డవారంతా బీజేపీకి ఓటు వేయాలని, సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు పొందుతున్న వారంతా బీఆర్ఎస్కు ఓటేయాలని మంత్రి తన ప్రసంగంలో పేర్కొనడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ఇప్పటివరకు ఏ పార్టీ నాయకుడు కూడా ఇలా చేసిన పనులపై బహిరంగంగా సవాల్ విసిరిన దాఖలాలు లేవంటూ విశ్లేషకులు పేర్కొనడం గమనార్హం. మొత్తానికి కేటీఆర్ నిర్మల్‌లో ఇటు కార్యకర్తలను ఉత్తేజపరుస్తూనే, బీజేపీ, కాంగ్రెస్‌పై ఎదురు దాడి కొనసాగించి.. ఆ రెండు పార్టీల అసలు స్వరూపాన్ని ప్రజల సమక్షంలో బట్టబయలు చేశారు.
యువనేత గౌతంరెడ్డి సారథ్యంలో సక్సెస్..
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తనయుడు, బీఆర్ఎస్ యువనేత అల్లోల గౌతంరెడ్డి పర్యవేక్షణలోనే మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు విజయవంతమయ్యాయి. వారం రోజులుగా గౌతంరెడ్డి.. మంత్రి కేటీఆర్ పాల్గొనే ప్రదేశాల వద్ద ఏర్పాట్లను స్వయంగా నిర్వహించారు. కేటీఆర్ చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పరిధిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆయన పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సైతం ఇటు జన సమీకరణ నుండి మొదలుకొని, సభ ముగిసే వరకు అంతా ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. సభకు హాజరైన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన అన్ని రకాల చర్యలు తీసుకున్నారు.
ముఖ్యంగా సభకు వచ్చిన వారందరికీ తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే కొంతమందికి అల్పాహార సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఆద్యంతం అన్నీ తానై కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయడంపై పట్ల బీఆర్ఎస్ శ్రేణులు యువనేత గౌతంరెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.