మంచిర్యాల, జూలై 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచారు.
రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. బాణాసంచా కాల్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించారు. పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు బ్యాగులు ఇచ్చారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆలయాల్లో పూజలు చేశారు.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు కేక్ కట్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, పడాల రవి పాల్గొన్నారు.
బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కేక్ కట్ చేశారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, 100 పడకల దవాఖానలో బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజారమేశ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌కుమార్ హైదరాబాద్‌లోని నందీనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం సహా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ సొనాల పీహెచ్సీ ఆవరణలో తుల శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో బాలింతలకు కేసీఆర్ కిట్లు అందజేశారు. గ్రీన్ ఇండి యా చాలెంజ్‌లో భాగంగా ముక్రా(కే) గ్రామస్తులు 100 మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లలో గెలవాలని ఆకాంక్షించారు. వారికి కేటీఆర్ నా హృదయంలో సదా ఉంటారని ట్వీట్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కేటీఆర్ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ సమన్వయ కర్త రాంకిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ముథో ల్ నియోజకవర్గ సమన్వయకర్త పడకర్తి రమాదేవి బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.