సారంగాపూర్, అక్టోబర్ 17 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రాంకిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని కరుణాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులకు ఇచ్చిన హమీలన్నింటికి కాంగ్రెస్ పార్టీ ఎగనామం పెట్టిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా రైతులకు కనీసం యూరియా బస్తాలను అందించడంలో కూడా విఫలమయిందన్నారు. పీఏసీఎస్ కేంద్రాల ఎదుట రోజుల తరబడి రైతులను నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు, 420 మోస పూరిత హమీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని, స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తే అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇవ్వడంతో పాటు స్థానిక ఎన్నికల్లో అవకాశం కూడా కల్పిస్తామన్నారు. బీజేపీ మతతత్వం పార్టీ అని, అభివృద్ధిని గాలికి వదిలేసి మత రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మారుగొండ రాము, డాక్టర్ సుభాష్ రావు, పార్టీ మండల కన్వీనర్ దేవి శంకర్, జీవన్ రావు, మధుకర్ రెడ్డి, శ్యాంరెడ్డి, లక్ష్మీ నారాయణ గౌడ్, భోజన్న, లక్ష్మణ్, గంగాధర్, ప్రవీణ్, రాజన్న, దత్తురాం, గజేంధర్, భోసాని భోజన్న, చంద్రశేఖర్ రెడ్డి, రాజేశ్వర్, సతీశ్, ప్రభాకర్ రెడ్డి, వెంకట్, బద్రీ నారాయణ, సతీశ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.