ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 2 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల సంక్షేమాన్ని విస్మరించి, పెద్దలకు మాత్రమే అనుకూలంగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. మార్కెట్కు కందులు తీసుకువచ్చిన తొలి రైతును శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే, కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తున్నదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా మోసపూరితంగానే ఉందని ఎద్దేవా చేశారు. క్రిప్టో, డిజిటల్ ఫైనాన్స్ అంటూ పెద్దలకు దోచిపెట్టేలా ఉందన్నారు. రైతులకు, రైతు కూలీలకు, నిరుద్యోగులకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అటు చిరుధాన్యాలకు సైతం ఎలాంటి మద్దతు ధర ఇవ్వలేదని తెలిపారు. కానీ ఆదిలాబాద్ బీజేపీ నేతలు మాత్రం గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజన్, డీసీసీబీ చైర్మన్ అడ్డ్ది భోజారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మార్కెట్ శాఖ ఏడీ శ్రీనివాస్, ఏవో పుల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు సెవ్వ జగదీశ్ యాదవ్, నారాయణ, ప్రేమల, రమేశ్ పాల్గొన్నారు.
ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
జైనథ్, ఫిబ్రవరి 2 : రైతు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 60 వేల ఎకరాల్లో కందులు సాగు చేయగా 60.99 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు సూచించారని తెలిపారు. రూ.6,300 మద్దతు ధరతో కందుల కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మన్లు గోవర్ధన్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, ఏడీఏ పుల్లయ్య, సర్పంచ్లు, ఎంపీపీలు, ఎం పీటీసీలు, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.