కుమ్రం భీం ఆసిఫాబాద్ : దళితులు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం దళిత బంధు కార్యక్రమాన్ని చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం దళిత బంధు పథకం మొదటి విడత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపికైన 18 మంది లబ్ధిదారులకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి వాహనాలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగంచేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి లబ్ధిదారునికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. ఈ నిధులను వినియోగించుకొని యూనిట్ల స్థాపన ద్వారా ఆదాయం పొందాలని తెలిపారు.
జిల్లాలో 12 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ముగ్గురికి కార్లు, ముగ్గురికి ఆటో ట్రాలీలు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జీవన్, ఆసిఫాబాద్ జెట్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.