రూ.4 కోట్లతో మహిళా సంఘాలకు భవనాలు
భీమారంలో రూ.150 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ
జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్
జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన 15 అంశాలపై చర్చ
హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్, అదనపు, ట్రైనీ కలెక్టర్లు
మంచిర్యాల, ఆగస్టు 26, నమస్తే తెలంగాణ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జడ్పీ సర్వ సభ్య సమావేశం నిర్వహించగా, కలెక్టర్ భారతీ హోళికేరి, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 15 ముఖ్యమైన అంశాలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని, అధికార యంత్రాంగం ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేయడం అభినందనీయమని వారు కొనియాడారు.
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమావేశ గదిని జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్ భారతీ హోళికేరీ, అదనపుకలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, ట్రైనీ కలెక్టర్ ప్రతిభాసింగ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జడ్పీ సర్వ సభ్య సమావేశం నిర్వహించగా, 15 ముఖ్యమైన అంశాలపై సమగ్రంగా చర్చించారు. విప్ సుమన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెడ్లలా పని చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికార యంత్రాంగానికి సూచించారు. మేధోమధనం, కార్యాచరణ నిరంతరం కొనసాగాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీ, సింగరేణి నిధుల నుంచి రూ.4 కోట్లతో జిల్లాలో అన్ని మహిళా సంఘాలకు భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి పనులను ఈ కమిటీల ద్వారా ప్రజలకు తెలియజేయాలని, అన్ని సంఘాల్లో సీఏలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సమావేశం ఏర్పాటు చేసుకొని ఇందుకు కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. అధికారులు ప్రజలు జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలన్నారు.
ప్రతి పనికీ సంబంధించిన నివేదిక జిల్లా పరిషత్ సమావేశాల్లో అందరికీ తెలియజేయాలని కోరారు. జిల్లాలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయని, అధికార యంత్రాంగం ప్రజా సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. కూరగాయలు, పండ్లతోటల పెంపకానికి రైతులను ప్రోత్సహించాలని, సాగుకు అవసరమైన మెళకువలు, సూచనలు అందించాలని సూచించారు. భీమారంలో రూ.150 కోట్లతో మ్యాట్రిక్స్ సంస్థ సమన్వయంతో పామాయిల్ ఫ్యాక్టరీ మంజూరైందని, జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగయ్యేలా అధికారులు రైతులను ప్రోత్సహించాలని కోరారు. 57 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీలోగా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ భారతీ హోళీకేరి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో 16 నెలల తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్నాయని, ప్రత్యేక డ్రైవ్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, ఫర్నిచర్, మౌలిక సదుపాయాలు సమకూర్చాలని, ఆవరణ, తరగతి గదులు శుభ్రంగా ఉంచాలని, నీటి నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలని, నల్లా కనెక్షన్ లేని చోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మధ్యాహ్నభోజనం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పాఠశాలలు, దవాఖానల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలదేనని, ఈ నెల 30లోగా ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయంతో నిర్వహించాలని, ఇనుప విద్యుత్ స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో స్థానిక సిబ్బందిని నియమించాలని, అధికారులు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి నరేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, అన్నిశాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.