తాండూర్, జూన్ 26 : హరితహారంలో కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంచిర్యాల జిల్లా జడ్పీ సీఈవో నరేందర్ సూచించారు. మండలంలోని మాదారం గ్రామంలో అభివృద్ధి పనులను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నర్సరీని పరిశీలించి ఏయే మొక్కలు, ఎన్ని పెంచుతున్నారని సర్పంచ్ సాగరిక, కార్యదర్శి సౌందర్యను అడిగి తెలుసుకున్నారు. రోడ్లకు ఇరువైపులా, చేలు, పొలాల గట్లు, తదితర ఖాళీ స్థలాల్లో మెక్కలు నాటాలన్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డు, మురుగు కాలువలు పరిశీలించారు. గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, పారిశుధ్య చర్యలపై ప్రశంసించారు. ఆయన వెంట ఎంపీడీవో శశికళ, ఎంపీవో అక్తార్ మొయినొద్దీన్, ఇన్చార్జి ఏపీవో సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.
అధికారుల పల్లెనిద్ర
వేమనపల్లి, జూన్ 26 : మండలంలోని కల్లెంపల్లి గ్రామంలో మండల పంచాయతీ అధికారి అనిల్‌కుమార్, సర్పంచ్ కుశ్రం పద్మ శుక్రవారం రాత్రి పల్లె నిద్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శనివారం ఉదయం గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. కంపోస్ట్ షెడ్, నర్సరీ, శ్మశాన వాటికలను పరిశీలించారు. గ్రామంలో హరితహారం సందర్భంగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, వీవోలు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, వీఆర్ఏ, కో ఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
కోటపల్లి, జూన్ 26 : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ సూచించారు. కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామపంచాయతీని సందర్శించి పల్లె ప్రగతి కార్యక్రమంపై ఎంపీవో దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామపంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పల్లె ప్రగతి ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుర్రం రాజన్న, సర్పంచ్ గుర్రం లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కమల్, గ్రామస్తులు పాల్గొన్నారు.