సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, నవంబర్ 17 : పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు ఆర్వోఎఫ్ఆర్ -2005 చట్టం ప్రకారం పట్టాలు పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను కుమ్రం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని ఈదులవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని పోడు భూములపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్వోఎఫ్ఆర్-2005 చట్టం ప్రకారం వివరాలు పరిశీలించి అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు అందజేస్తామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పోడు భూములు , సాగు చేస్తున్న రైతులు ఇతర వివరాల సేకరణ సర్వేను పకడ్వందీగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్వే ఇన్స్పెక్టర్ సోమేశ్వర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫయాజ్ అలీ, మండల సర్వేయర్ భరత్, సర్పంచ్ రుషి భీమేశ్ , అధికారులు ఉన్నారు.
సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
పెంచికల్పేట్ , నవంబర్ 17 : పోడుభూముల సర్వే ఎలాంటి అవకతవకలు లేకుండా, పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశం ఆదేశించారు. బుధవారం మండలంలోని లోడ్పల్లి, కొండపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న పోడు భూముల సర్వే, రైతుల అర్జీలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. అనంతరం కొండపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనంతరాజు, ఎంపీడీవో శ్రీనివాస్, ఆర్ఐ గోపాల్, పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్, కుస్సుద్దీన్, రైతులు పాల్గొన్నారు.
ఆధారాలకు సంబంధించిన పత్రాలు జత చేయాలి
బెజ్జూర్, నవంబర్ 17 : పోడు భూములకు పట్టాల కోసం చేసుకునే రైతులు దరఖాస్తుతో పాటు ఆధారాలకు సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలు, గ్రామ పెద్దల వాంగ్మూలాన్ని జత చేయాలని కాగజ్నగర్ ఆర్డీవో ఛిత్రు సూచించారు. మండలంలోని సోమిని గ్రామ పంచాయతీలో పోడు రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. అనంతరం దరఖాస్తుదారులకు అవగాహన కల్పించారు. సులుగు పల్లిలో తహసీల్దార్ రఘునాథ్ రావు, ఎంపీడీవో గంగాసింగ్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రమేశ్ రెడ్డి, ఏఎస్వో రోషిత్, సర్పంచ్లు స్వప్న, శారద కార్యదర్శులు ఇస్తారి, ఈశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.