కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కెరమెరి, అక్టోబర్ 17 : జల్.. జంగిల్.. జమీన్ కోసం పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ, గిరిరత్న కుమ్రంభీంను యావత్ ప్రజానీకం స్మరించుకున్నది. గురువారం జోడేఘాట్‌లో భీం, కుమ్రం సూరు వర్ధంతిని అధికారికంగా నిర్వహించగా, తెలంగాణ నుంచేగాకుండా పొ రుగు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన అడవిబిడ్డలతో పో రుగడ్డ పులకించింది.
డప్పు చప్పుళ్లు, సన్నాయి, కాలి కోం వాయిద్యాలు.. ఆటా పాటలతో ఆ ప్రాంతం మా రుమోగింది. భీం మనువడు కుమ్రం సోనేరావ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, మంత్రి సీతక్క(ధనసరి అనుసుయ), ఆసిఫాబాద్, ఖానాపూర్, సిర్పూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, వెడ్మా భొజ్జు, పాల్వాయి హరీశ్‌బాబు, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, కు మ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఐటీడీ ఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎస్పీ డీ.వీ.శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతోపాటు ఆదివాసీ సంఘాల నాయకులు హాజరై సామూహిక పూజలు చేశారు. అమరవీరుల జెండాలను ఎగురవేశారు.
అనంతరం భీం విగ్రహం, సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుమ్రం సూరు మనువడు కుమ్రం పాండు ఆధ్వర్యంలో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కొలాం ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా నివాళులర్పించారు. అనంతరం సంప్రదాయ వాయిద్యాల పై ఆదివాసీలు నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. వర్ధంతి సందర్భంగా హట్టి నుంచి జోడేఘా ట్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. సభకు వచ్చిన మహిళలు, పురుషులు, వీఐపీలు, పోలీసులు, మీడియాకు వేర్వేరుగా తాగునీరు, భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పెందోర్ రాజేశ్వర్, కన్వీనర్ మోతీరాంతో పాటు ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
భీం 84వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన దర్బార్‌లో ఆదివాసీ కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గోండి, తెలుగు భాషలో కళాకారులు పాడిన పాటలు, గుస్సాడీ, డెంస్సా నృత్యాలు కనువిందు చేశాయి. గోండ్, ప్రధాన్, కొలాం, తోటి, నాయక్‌పోడ్, మొత్తం 9 తెగల ఆదివాసీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతిని ప్రదర్శించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరంతో పాటు మొబైల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల విభాగంలో అర్టీలను స్వీకరించారు.
భీం సంస్మరణ సభ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. హట్టి నుంచి జోడేఘాట్ వరకు రహదారి పొడువునా తనిఖీలు చేపట్టారు. పహారాకాశారు.