మంచిర్యాల, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గ్రామ శివారులో 10 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. వెంచర్ ఏర్పాటు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై అక్టోబర్ 5వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ప్రభుత్వ భూ మి స్వాహా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. సర్వే నంబర్ 169తో 2.13 గుంటల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి, దాన్ని ఆనుకుని ఉన్న 10 గుంటల ప్రభుత్వ భూమిని కలిపేసుకుని వెంచర్ చేశారని విమర్శలకు కథనం అద్దం పట్టింది.
ఈ వెంచర్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు. అయినప్పటికీ నోటీసులు ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని కథనంలో ప్రశ్నించింది. ఈ మేరకు అదే రోజున పంచాయతీ కార్యదర్శి ‘అక్రమ వెంచర్ వేశారు. దీనికి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరించి లేఅవుట్‌కు దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు సమర్పించండి. మీ వెంచర్లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలిసింది. దానిపై వివరణ ఇచ్చి అందుకు సంబంధించిన బాండ్ పత్రాలు ఏమైనా ఉంటే పంచాయతీలో సమర్పించండి.
ఈ నోటీసు అందిన మూడు రోజుల్లో స్పందించాలి..’ అని నోటీసులు జారీ చేశారు. ఇదీ జరిగి పది రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆ వెంచర్ నిర్వాహకులు, భూమి యాజమానులు స్పందించలేదు. మూడు రోజుల్లో స్పందించాలని నోటీసులు ఇచ్చిన కార్యదర్శి వారి నుంచి ఎలాంటి రిప్లయ్ రాకపోయినా తదుపరి చర్యలు తీసుకోండా చోద్యం చూస్తుండడంపై స్థానికులు మండిపడుతున్నారు. వార్త వచ్చిందని నోటీసు ఇచ్చి చేతులు దులుపేసుకున్నారే తప్పా వెంచర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ భూమిపై విచారణ
‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంతో ఈ వెంచర్లో ప్రభుత్వ భూమి ఉన్న విషయంపై హాజీపూర్ తహసీల్దార్ విచారణ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో విక్రయించిన 2.13 గుం టల భూమిని సంబంధించి పట్టాతోపాటు ఇం దులో కలుపుకున్నారని చెప్తున్న ప్రభుత్వ భూ మికి సంబంధించి వివరాలతో తహసీల్దార్ ఆ రా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలో పక్క న రోడ్డుకు మూడున్నర గుంటల పట్టాభూమి ఇచ్చామని, దానికి బదులుగా ఇక్కడ ఆరు గుంటల ప్రభుత్వ భూమిని మాకు అధికారు లు ఇచ్చారని యజమానులు చెప్పినట్లు తహసీల్దార్ చెబుతున్నారు.
ఒకవేళ ప్రభుత్వం నిజంగానే భూమి ఇచ్చి ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు చూపించండి అంటే మాత్రం అలాంటివి ఏమీ లేవని, అప్పుడున్న కలెక్టర్ నోటి మాటగా చెప్పారని వాళ్లు చెబుతున్నట్లు తెలిసింది. రోడ్డు కోసం కోల్పోయిన భూమి మూ డున్నర గుంటలైతే.. కలెక్టర్ ఆరు గుంటలు ఎలా ఇచ్చారు. ఒకవేళ ఇస్తే పేపర్ లేకుండా నోటి మాటపై ఇచ్చింది ఎలా చెల్లుతుంది.
అసలు కలెక్టర్ ఇచ్చారా? ఇవ్వలేదా? ఆరు గుంటలు ఇస్తే వెంచర్లో 10 గుంటలు ఎలా కలిసింది. అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరగా ప్రభుత్వ భూమి ఉందా? లేదా? తెలుసుకునేందుకు సర్వే చేస్తామని చెప్పారు. ఆ సర్వేలోనైనా నిజానిజాలు బయటికి రావాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూమి ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్‌పై పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.