నిర్మల్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ) : తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికార కాంగ్రెస్ పా ర్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీని పట్టణ ప్రజలు తిరస్కరించి షాక్ ఇచ్చారు. పట్టణంలో మొత్తం 12 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థులు 4 వార్డుల్లో, బీజేపీ అభ్యర్థులు 4 వార్డుల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ 3 వార్డులకే పరిమితమైంది. ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. కాగా ఆ ఇండిపెండెంట్ కౌన్సిలర్‌ను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ తమ బలాన్ని 4 కు పెంచుకుంది. ఇక్కడి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకొనేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను మాత్రం ఏ పార్టీ కూడా చేరుకోలేదు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అవరసమైన కోరం లేక రెండుసార్లు ఎన్నిక వా యిదా పడింది.
ప్రస్తుతం ఇక్కడి ఎన్నిక వ్యవహారం ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్లింది. మళ్లీ కమిషన్ ప్రకటించే తేదీ రోజు మరోసారి ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ముందుకొచ్చా యి. బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు కుదిరే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు కొలిక్కి వస్తే బీఆర్ఎస్కు చైర్మన్ పదవి, బీజేపీకి వైస్ చైర్మన్ పదవితోపాటు కో-ఆప్షన్ పదవులు దక్కే అవకాశాలు ఉ న్నాయన్న చర్చ జరుగుతున్నది. దీనికి బీజేపీ నాయకులు చేసిన ప్రకటన మరింత బలం చేకూరుస్తున్నది. రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆకుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణ ప్రజల ఆకాంక్ష మేరకు బీఆర్ఎస్ నాయకులు తమతో పొత్తుకు కలిసి రావాలని బహిరంగంగానే మద్దతు కోరారు.
ఖానాపూర్ జేఏసీ నేతృత్వం లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదనకు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భు క్యా జాన్సన్ నాయక్ సానుకూలంగా స్పందించారు. స్థానిక రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్‌కు మద్దతు ఇ వ్వడం కన్నా బీజేపీతో కలిసి ముందుకు వెళ్లడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. బీజేపీ నాయకులు చెప్పిన విధంగా మొదట బీఆర్ఎస్కే చైర్మన్ అవకాశం ఇవ్వాలని కోరుతూ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఈ క్ర మంలో తమతో చర్చించకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంపై బీజేపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ నా యకులు చేసిన ప్రతిపాదన మేరకే తమ అభ్యర్థిని ప్ర కటించామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు మీడియా సాక్షిగా చేసిన ప్రకటనపై ఏ మేరకు కట్టుబడి ఉంటారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే మరోపక్క కాంగ్రెస్ నాయకులు ప్రలోభాల పర్వానికి తెర లేపినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఇండిపెండెంట్ సభ్యుడితో కలిపి ఆ పార్టీకి నలుగురి మద్దతు ఉండగా, ఒక ఎక్స్ అఫిషియో ఓటు ఉండడంతో పార్టీ బలం 5 కు చేరిం ది. చైర్మన్ పదవి దక్కాలంటే మరో ఇద్దరు సభ్యుల మద్దతు అవసరముంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ఇండిపెండెంట్ అభ్యర్థిని పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులు.. మరో ఇద్దరు సభ్యుల కోసం పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపల్ పీఠం ఎవరి పరమవుతుందోనన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.