దస్తురాబాద్, మార్చి 8 : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కడెం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిందని మండిపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈడీ నోటీసులు ఇవ్వడం చాలా బాధకరమైన విషయమని పేర్కొన్నారు.
ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణోద్యమంలో జాగృతి తరుఫున ఎమ్మెల్సీ కవిత మహిళలతో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలంగాణ ప్రజలు, మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తమ వైఖరిని మార్చుకోవాలని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీకియ ప్రజలే బుద్ధిచెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.