తాండూర్ : పరిసరాల పరిశుభ్రతతో రోగాలు దరి చేరకుండా ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చని, ముఖ్యంగా డెంగ్యూ ( Dengue ) వ్యాధిని అరికట్టవచ్చని ఎంపీడీవో శ్రీనివాస్ ( MPDO ), వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీరాణి ( Jhansirani ) సూచించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా తాండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు.
ఒక్క దోమ అనేక ప్రమాదాలు అనే నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఏడీస్ ఈజిప్ట్ దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందన్నారు. ఇంటి లోపల ఉండే పూల కుండీలు, కూలర్లు, మంచినీటి తొట్లు, కొబ్బరి బోండాలు, నిల్వ ఉన్న మంచి నీటి పరిసరాలలో స్థావరం ఏర్పాటు చేసుకుని జబ్బు బారిన పడిన వ్యక్తి నుంచి వాహకాన్ని మోసుకొచ్చి కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫ్రైడే డ్రైడే పాటించాలని, సమాజ భాగస్వామ్యం తోనే డెంగ్యూను నివారించవచ్చని అన్నారు. ఎవరికైనా జ్వరం బారిన పడినట్లయితే ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు నిర్వహించుకుని, నిర్ధారణ అయితే మందులు వాడాలని సూచించారు.