ఆదిలాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బరాబర్ ప్రధాని అవుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గొప్పవి. ఆయనకు అందరి కష్టాలు తెలుసు. ఎవరికి ఏం చేయాలనే దానిపై మంచి అవగాహన ఉంది. కేసీఆర్ ప్రధాని అయితే దేశ ప్రజలకు ఎంతో మేలు. ఏడాదిలోనే దేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో నిలుపుతారని మహారాష్ట్ర వాసులు తమ మనోగతాన్ని వెల్లడించారు. ‘నమస్తే తెలంగాణ’ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ తాలుకా నెక్లి, అంఠానా, పాలజ్, మంచిర్యాల జిల్లా సరిహద్దున ఉన్న సిరోంచ, చింతలపల్లి, రామనుపురం, జానంపల్లి, చంద్రాపూర్ జిల్లా, యావత్మాల్ జిల్లా ఝరిజామని తాలుకా ధిగ్స్ గ్రామాల్లో పర్యటించి.. వారితో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారు ప్రశంసలతో ముంచెత్తారు. ముందుచూపు ఉన్న నాయకుడని, బరాబర్ ప్రధాని అవుతారనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన ఏడేండ్లలోనే ప్రజా సంక్షేమ పథకాలు, వినూత్న ఆలోచనలతో తెలంగాణ అన్ని రాష్ర్టాలకూ దిక్సూచిగా మారిందని కొనియాడుతున్నారు. ఏదో ఒక సంక్షేమ పథకం అందని ఇల్లు, లబ్ధిదారు లేని ఊరు తెలంగాణలో లేదని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని, తెలంగాణకు పక్కనే ఉన్న తాము పక్క రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూస్తూ ‘మేమెందుకు తెలంగాణలో పుట్టలేదా?’ అని బాధపడుతున్నామని చెప్పారు.
రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్లు, కులవృత్తులకు చేయూత, డబుల్ బెర్రూం ఇండ్లవంటి దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు రైతులు, పేద ప్రజల గురించి ఆలోచించి వారికి ఉపయోగపడే సరికొత్త పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తాము టీవీలు, స్మార్ట్ఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇలాంటి నాయకుడు దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు. సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే సుపారిపాలన అందుతుందని, పురోగతి సాధించడం ఖాయమని వారు అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో సరైన పథకాలు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణలో ఉన్న తమ బంధువులు అక్కడి పథకాల గురించి చెబితే తమకు సంతోషం కలుగుతుందన్నారు. తాము కూడా తెలంగాణలో ఉంటే ఉపాధి మెరుగుపడేదని, పిల్లలను బాగా చదివించుకునే అవకాశం ఉండేదన్నారు. తమ గ్రామాన్ని తెలంగాణలో కలిపితే ఎంతో బాగుండేదని గ్రామస్తులు కోరుతున్నారు.
‘దేశ్‌కీ నేత.. స్ఫూర్తి ప్రదాత కేసీఆర్. తెలంగాణ సాధించిన అనతికాలంలోనే ఆ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఆయన చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి ఫిదా అవుతున్నాం. రోజూ టీవీల్లో కేసీఆర్ మాటలను వింటున్నం. రైతును రాజును చేసేందుకు ఆయన ఎంత తపన పడుతున్నడో అర్థమవుతుంది. అలాంటి ముఖ్యమంత్రి దొరకడం ఆ ప్రజల అదృష్టం. దేశంలో అందరు నాయకుల కంటే ప్రధానిగా కేసీఆర్‌కు అన్ని అర్హతలున్నాయి. ఆయనకు పగ్గాలు అప్పగిస్తే దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలపడం ఖాయం’ అని మహారాష్ట్ర వాసులు తమ మనోగతాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ బృందం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ తాలుకా నెక్లి, అంఠానా, పాలజ్, చంద్రాపూర్, సిరొంచ, చింతలపల్లి, రామనుపురం, జానంపల్లి, యావత్మాల్ జిల్లా ధిగ్స్ గ్రామాల్లో పర్యటించి, వారితో మాట్లాడగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇలా ప్రశంసలతో ముంచెత్తారు.
– ఆదిలాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ సర్కారోళ్ల పథకాలు మస్తు మంచిగున్నయ్. మేము కూడా అక్కడ పుడితే బాగుండు అనిపిస్తంది. ఇక్కడ మా గవర్నమెంటోళ్లు రూ. 600 పింఛనే ఇస్తన్రు. గా పైసలు కూడా ఎప్పుడస్తయో తెల్వదు. చేతికందినా ఎటూ చాలవు. మా దగ్గర గుంట భూమి ఉన్నా పింఛన్ ఇయ్యరు. గదే తెలంగాణల గట్లాంటిదేమీ లేదు. అందరికీ ఇస్తరు. గాడ పింఛన్ పైసలు కూడా ఎక్కువే. సీఎం కేసీఆర్ మాలాంటి ముసలోళ్లకు రెండు వేల పదహార్లు ఇస్తన్రు. గవ్విటితో నెలంతా రంది లేకుంట బతుకచ్చు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే పేదోళ్ల బతుకులు బాగుపడుతయ్. – పోటు రామన్న, చింతలపల్లి, గడ్చిరోలి జిల్లా, మహారాష్ట్ర
నాకు 28ఎకరాల సాగు భూమి ఉంది. తెలంగాణలో ఇంతే భూమి ఉన్నోళ్లు రాజుగా బతుకుతున్నరు. ఇక్కడ సర్కారు రైతులకు అందించే సాయం ఏమీ లేదు. దేశ రాజకీయాల్లోకి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఎంట్రీ గనక ఇస్తే దేశంలోని అన్ని రాష్ర్టాల్లో పథకాలు అమలవుతాయన్న నమ్మకం ఉంది. ముందు చూపుతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పెట్టుబడి సాయం ఇవ్వడం చారిత్రాత్మకం. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోని అన్ని వర్గాలకు అవసరం ఉన్నది. మహారాష్ట్రలో గతేడాది కేవలం రుణమాఫీ మాత్రమే చేశారు. కానీ తెలంగాణలో రైతుల కోసం అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, 24గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంటు, కళ్యాణలక్ష్మి, పింఛన్ లాంటి పథకాలు ఏ ఒక్కటీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ అమలవడం లేదు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– బెర్షట్వార్ హన్మండ్లు, పంచాయతి సమితి సభ్యుడు, నెఖిలి, భోకర్ తాలుకా, నాందేడ్
తెలంగాణలో గిరిజన తండాలను జీపీలుగా మార్చడంతో పాటు రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించి అటవీ ప్రాంతాల్లోని తండాల రూపురేఖలు మార్చేశారు. ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి వారి పాలిట ఆరాధ్య దైవంగా మారిన కేసీఆర్ దేశానికి పీఎం కావడం అవసరం. అన్ని పక్షాలు ఏకమై ప్రధాని అభ్యర్థిగా కేసీఆర్‌ను ప్రకటించాలి. గిరిజన తండాల్లో ఆరాధ్యదైవం సంత్‌సేవాలాల్ మహరాజ్, జగదాంబా దేవీ ఆలయాలను నిర్మించి వారిలో దైవత్వాన్ని ఇనుమడింపజేశారు. వ్యవసాయ రంగంలో రాణించే విధంగా బోర్లు, ల్యాండ్ డెవలప్మెంట్ పథకాలను అమలు చేస్తున్నారు. ఆయన ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-పాండు ఫుల్సింగ్ జాదవ్, రైతు, అంఠానా, భోకర్ తాలుకా, నాందేడ్ జిల్లా
మాది మహారాష్ట్ర. తెలంగాణలో ఉన్న పథకాలను చూసి మేము అక్కడ ఎందుకు పుట్టలేదోనని మనసుకు బాధ అయితది. మూడు కిలోమీటర్ల దూరంలోని తెలంగాణలో మాలాంటోళ్లకు ఎన్నో సౌకర్యాలు, వ్యవసాయ రుణాలు, మహిళలకు పథకాలు, రైతులకు బీమా, పెట్టుబడి సాయం, ఉచిత కరంటు, వృద్ధులు, వితంతువులకు రూ.2వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.3వేలు ప్రతి నెలా పింఛన్లు ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నరు. కేసీఆర్ బరాబర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నాం. మా గ్రామాన్ని కూడా తెలంగాణలో కలిపితే మేం అక్కడి రైతుల లాగా బాగుపడుతాం.
– బైర్శెట్టివార్ రమేశ్, రైతు, పాలజ్, భోఖర్ తాలుకా, నాందేడ్ జిల్లా
తెలంగాణ బార్డర్‌కు మా ఊరు తగిలి ఉంది. మేము రోజూ టీవీల్లో కేసీఆర్ పథకాల గురించి మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటాం. రైతులతో పాటు అందరికోసం అమలు చేస్తున్న పథకాలు వింటే మా మనసంతా కరిగిపోతుంది. పక్కన ఉన్న తెలంగాణలో రైతులకు ఇన్ని పథకాలిచ్చి రైతులను రాజులను చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంత తపన పడుతున్నడో అర్థమవుతుంది. దేశంలో అందరు నాయకుల కంటే ప్రధానిగా కేసీఆర్‌కు అన్ని అర్హతలున్నాయి. ఆయన ప్రజల గురించి ఆలోచించి వారికి ఏమైనా చెయ్యాలనుకునే మహా మనిషి. దేశంలో రైతులకు, సామాన్యులకు కేసీఆర్ సేవలు అవసరం ఉన్నయ్. – అందెల్వార్ ధర్మేశ్, పాలజ్, రైతు
కేసీఆర్ లాంటి పాలకుడు భారతదేశంలో లేడు..
కేసీఆర్ లాంటి పాలకుడు భారతదేశంలోనే లేడు. తెలంగాణ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మేం కేసీఆర్ పాలనకు ఫిదా అవుతున్నాం. తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్షి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్న పాలకుడు కేసీఆర్. మా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావడం లేదు. కేసీఆర్ ప్రతి ఊరినీ మురిపిస్తుండు. ఇక్కడ మా రాష్ట్రంలో ఏమీ అమలు కావడం లేదు. ఇలాంటి నాయకుడు దేశానికి అవసరం. ఇలాంటి నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నది. – తోటపల్లి సంజీవరెడ్డి, జానంపల్లి, మహారాష్ట్ర
తెలంగాణలో అమలవుతున్న రైతుబీమా పథకం గురించి విన్నా. ఈ పథకంలో భాగంగా రైతులు ఏ కారణంతోనైనా చనిపోతే రూ.5 లక్షల వస్తాయని, చాలా మంది రైతు కుటుంబాల సభ్యులకు వచ్చినట్లు అక్కడ ఉన్న మా సుట్టాలు చెబుతారు. మా భార్య పేరిట 3 ఎకరాల భూమి ఉంది. రెండేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయింది. తెలంగాణలో ఉంటే నాకు రూ.5 లక్షలు వస్తుండే. అక్కడి ముఖ్యమంత్రి రైతుల కుటుంబాల గురించి ఆలోచించి ఈ పథకం పెట్టారు. బీమా పైసలు మాలాంటి రైతులకు ఎంతో భరోసా కల్పిస్తాయి. కుటుంబాలు వీధిన పడుకుండా ఉండటానికి ఇది గొప్ప పథకం.
– కిష్టన్న, కుంటాలవార్, రైతు, ధిగరస్, మహారాష్ట్ర
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చారు. ఇక్కడి ముఖ్యమంత్రి, ఇతర నాయకులతో చర్చలు జరిపారు. ఆయన నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. ఏడేళ్లలోనే తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ దేశాన్ని కూడా అన్నిరం గాల్లో ముందుకు నడిపిస్తారు. సాగునీటి వినియో గం, పంటల సాగు, రైతులకు, పేదలకు ఎలాంటి పథకాలు తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. కేసీఆర్ సర్ ఆలోచన విధానం ఎవరికీ లేదు. గట్టి నమ్మకంతో ఆయన చెప్పిన వాస్తవ విషయాలు ప్రజలు విశ్వసిస్తారు.
– బోతల్వార్ దశరథ్, ధిగరస్, మహారాష్ట్
తెలంగాణలోని పేదింటి ఆడబిడ్డ పెండ్లి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మివంటి పథకాలు తీసుకొచ్చి పేదింటి బిడ్డలకు పెద్దన్నగా నిలుస్తున్నాడు. ప్రతి పెండ్లికి రూ. లక్షా 116 అందజేస్తున్నడు. ఇలాంటి పథకాన్ని దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదు. ముస్లిం ఆడపిల్లల పెండ్లి కోసం షాదీ ముబారక్ అమలు చేస్తున్నారు. మా దగ్గర ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆప్పులు చేయాల్సి వస్తుంది. సీఎం కేసీఆర్‌వంటి నాయకుడు ప్రధాన మంత్రిగా ఉంటే దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది.
– తాజొద్దీన్, లకడ్కోట్, చంద్రాపూర్ జిల్లా
మా రాష్ట్ర ప్రభుత్వం వేయి రూపాయల పింఛన్ మాత్రమే ఇస్తుంది. అదే తెలంగాణలో వృద్ధులకు 2 వేల రూపాయలు, వికలాంగులకు రూ.3వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. తెలంగాణలో ఇచ్చే ఆసరా పింఛన్లతో వృద్ధులు, వికలాంగులు నెల రోజులు తేలికగా బతుకవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఎటూ సరిపోవడం లేదు. మా ప్రాంతం తెలంగాణలో ఉంటే మా బతుకులు బాగుండేవి. మాకే కాదు దేశానికి కేసీఆర్‌లాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయి.
– బాడ్ కృష్ణ, పార్డిగూడ, చంద్రాపూర్ జిల్లా
తెలంగాణ ప్రభుత్వం పేదల ఇంట పెండ్లి సందడి కోసం ఇస్తున్న షాదీముబారక్‌తో అప్పులు లేకుండా పెండ్లి చేయచ్చు. అదే మా మహారాష్ట్రలో పెదింట పెండ్లి అంటే అప్పుల కుంపటిలా మారింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే రూ.1,00,116 తో ఇప్పుడు తెలంగాణలో ఏ ఇంట చూసినా పెండ్లి సందడి పండుగలా మారుతున్నది. హిందూ, ముస్లిం తేడా లేకుండా ప్రతీ ఆడ బిడ్డ పెండ్లికి కేసీఆర్ అందిస్తున్న సాయం మరువలేనిది. మైనార్టీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవాలని ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసి చక్కటి చదువులను కేసీఆర్ అందిస్తున్నాడు. మసీద్‌లో పనిచేసే ఇమామ్‌లకు తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.5 వేలు అందిస్తుండగా, ఇక్కడ మాకు ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు. తెలంగాణలో మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌కు దేశ పగ్గాలు అప్పజెప్తే దేశం రూపురేఖలు మారుతాయి.
– నజీర్ భాయ్, సిరొంచ, మహారాష్ట్ర